B. Gopal: ఎన్టీఆర్ కళ్లుతిరిగి పడిపోతారని అంతా టెన్షన్ పడ్డారు: డైరెక్టర్ బి. గోపాల్

  • 'అడవిరాముడు' గురించి ప్రస్తావించిన బి.గోపాల్
  • రాఘవేంద్రరావు కట్టిన కిళ్లీ గురించిన వివరణ 
  •  ఎన్టీఆర్ 'కిమామ్' ఎక్కువగా వేసుకున్నారని వెల్లడి 
  • ఆయనకి కళ్లు తిరగకపోవడం పట్ల ఆశ్చర్యం 
B Gopal Interview

ఎన్టీ రామారావుతో కలిసి పనిచేసిన వాళ్లంతా, ఆయన గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను చెబుతుంటారు. 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ, ఎన్టీ రామారావు గురించి ప్రస్తావించారు. సాధారణంగా 'మిరపకాయ బజ్జీ' తినే అంతా కారం అంటూ ఉంటారు. కానీ రామారావుగారు ఆవకాయ పచ్చడిలో మిరపకాయ బజ్జీ ముంచుకుని తినేవారు" అని చెప్పారు. 

'అడవిరాముడు' సినిమా షూటింగులో ఒక గమ్మత్తు జరిగింది. ఆ సినిమా కోసం ఎన్టీఆర్ .. జయసుధ .. జయప్రద .. 50 మంది డాన్సర్లపై రాఘవేంద్ర రావుగారు ఒక గ్రూప్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. షూటింగు గ్యాపులో రాఘవేంద్రరావు గారు 'కిమామ్' కొద్దిగా తమలపాకులకు రాసి వేసుకునేవారు. ఆ రోజున ఆయనతో పాటు జయప్రద .. కెమెరా మెన్ ప్రకాశ్ గారు కూడా కిళ్లీ వేసుకున్నారు. అది చూసి .. తనకి కూడా ఒక కిళ్లీ కట్టి ఇవ్వమని రామారావుగారు అడిగారు. 

 రాఘవేంద్రరావు గారు కొంచెం 'కిమామ్' రాసి కిళ్లీ కడుతుంటే, 'అదేం సరిపోతుంది బ్రదర్ .. ఆ బాటిల్ ఇటు ఇవ్వండి' అంటూ తీసుకున్నారు. ఆ సీసాలోని ముప్పావు వంతు 'కిమామ్' ను తీసుకుని కిళ్లీ కట్టుకున్నారు. 'అన్నగారూ అంత వేసుకుంటే కళ్లు తిరిగి పడిపోతారు' అని రాఘవేంద్రరావుగారు అంటే, 'అదీ చూద్దాం బ్రదర్' అంటూ కిళ్లీ వేసుకున్నారు. ఇక ఆయన పడిపోవడం ఖాయమని అంతా టెన్షన్ తో చూస్తూ ఉన్నారు. కానీ ఆయనకి ఏమీ కాలేదు .. ఆ వెంటనే లేచి షూటింగులో పాల్గొన్నారు" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News