Bareilly: బెయిల్ పై బయటకు తీసుకొచ్చిన భార్యనే కాల్చి చంపిన భర్త.. అనుమానంతోనేనట!

Wife secures bail for jailed hubby but he shoots her dead in Bareilly
  • ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో దారుణం
  • తనను మోసం చేసినందుకే చంపేశానన్న భర్త
  • పోలీసుల విచారణలో వెల్లడి.. అనాథలుగా మారిన పిల్లలు
జైలుకు వెళ్లిన భర్తను కాళ్లరిగేలా తిరిగి బెయిల్ పై బయటకు తీసుకువచ్చిందా భార్య.. ఆ భర్త మాత్రం అనుమానంతో ఆమెను కాల్చి చంపాడు. దీంతో మళ్లీ జైలుపాలయ్యాడు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగిందీ దారుణం. తల్లి మరణించడం, తండ్రి జైలుకు వెళ్లడంతో పిల్లలు ఇద్దరూ అనాథలుగా మారారు. పోలీసు విచారణలో తన భార్య తనను మోసం చేసిందని, అందుకే చంపేశానని ఆ భర్త వెల్లడించాడు.

బరేలీకి చెందిన కృష్ణపాల్ లోధి, పూజ ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో 2012లో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. లోధీకి సరైన ఉద్యోగం దొరకకపోవడంతో పూజ ఓ బ్యూటీపార్లర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. చిన్నచితకా పనులు చేస్తూ లోధీ కాలం గడుపుతున్నాడు. ఇటీవలి కాలంలో భార్యపై అనుమానం పెంచుకున్న లోధీ తరచూ ఆమెతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో ఓ కేసులో లోధీ జైలుపాలయ్యాడు.

పూజ లాయర్ల చుట్టూ తిరిగి బెయిల్ పై లోధీని బయటకు తీసుకువచ్చింది. పదిహేను రోజుల క్రితమే బయటకు వచ్చిన లోధీ.. శనివారం సాయంత్రం భార్యతో గొడవ పెట్టుకుని కోపం పట్టలేక నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. వరుసగా బుల్లెట్లు దిగడంతో పూజ అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత పూజ స్నేహితుడు మున్నాపైనా లోధీ కాల్పులు జరిపాడు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని లోధీని అదుపులోకి తీసుకున్నారు. హత్య, హత్యాయత్నం కేసులు పెట్టి మళ్లీ జైలుకు పంపించారు. కాగా, కాల్పుల్లో గాయపడ్డ మున్నా ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.
Bareilly
Crime News
wife murder
jailed husband
bail
Uttar Pradesh

More Telugu News