mobile gaming: మొబైల్ గేమ్ కోసం.. అమ్మ ఖాతాలో రూ.36 లక్షలు ఖాళీ చేసిన అంబర్ పేట బాలుడు

Hyderabad woman left with no money in bank after her 16 year old son spent Rs 36 lakh on mobile gaming
  • ఫ్రీ ఫైర్ గేమింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న బాలుడు
  • గేమ్ లో ముందుకు వెళ్లాలంటే డబ్బులు చెల్లించాలన్న నిబంధన
  • ఆటలో మజా ఉండడంతో చెల్లిస్తూ వెళ్లిపోయిన బాలుడు
  • రెండు ఖాతాల నుంచి మొత్తం రూ.36 లక్షలు ఖర్చు
పిల్లల పట్ల సరైన పర్యవేక్షణ ఎందుకు ఉండాలో ఈ ఘటన తెలియజేస్తోంది. పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందనేది ఒక కోణం అయితే.. మరోవైపు వారు వ్యసనానికీ బానిసలవుతారన్నది ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లోని అంబర్ పేటకు చెందిన 16 ఏళ్ల బాలుడు మొబైల్ గేమ్ కోసం అమ్మ ఖాతాలో ఉన్న రూ.36 లక్షలూ ఖర్చు చేసిన ఘటన వెలుగు చూసింది. 

సైబర్ పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. ఫ్రీ ఫైర్ గేమింగ్ యాప్ ను బాలుడు తొలుత తన తాత మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఇది ఉచిత గేమ్. అయితే గేమ్ లో కొన్ని లెవల్స్ పూర్తి చేసిన తర్వాత, మరింత ముందుకు వెళ్లాలంటే అప్పుడు కొంత డబ్బులు చెల్లించాలనే నోటిఫికేషన్ వచ్చింది. దీంతో బాలుడు తొలుత తన తల్లి ఖాతా నుంచి రూ.1,500 చెల్లించాడు. గేమ్ లో మరింత ముందుకు వెళ్లే కొద్దీ ఆ బ్యాలన్స్ కూడా ఖాళీ అయిపోయింది.

ఆ తర్వాత మరో రూ.10,000ను అమ్మ ఖాతా నుంచి చెల్లించాడు. గేమ్ లో మరింత ముందుకు వెళుతున్న కొద్దీ ఏదో తెలియని మజా అతడికి అనిపించింది. దాంతో దాన్ని వదిలిపెట్టలేకపోయాడు. అమ్మకు తెలియకుండా అలా రూ.1.45 లక్షలు, రూ.2 లక్షల చొప్పున చెల్లించాడు. ఎస్ బీఐలో బాలుడి తల్లికి ఖాతా ఉంది. సాధారణంగా డబ్బులు డెబిట్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లోనే ఎస్ బీఐ ఖాతాదారులకు అలర్ట్ మెస్సేజ్ లు వస్తుంటాయి. చాలా సందర్భాల్లో రావు. మరి ఆ బాలుడి తల్లికి ఎస్ఎంఎస్ లు రానట్టుంది. ఆమె డబ్బులు డ్రా చేసుకుందామని బ్యాంకు ఖాతాకు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది చెప్పిన సమాధానం విని షాక్ కు గురైంది. 

ఖాతాలో డబ్బుల్లేవని చెప్పారు. ఆమె ఖాతా నుంచి రూ.27 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపారు. తర్వాత తెలిసిన మరో షాకింగ్ విషయం ఏమిటంటే సదరు బాలుడు తన తల్లికి హెచ్ డీఎఫ్ సీ ఖాతా నుంచి కూడా మరో రూ.9 లక్షలకు ఖర్చు చేశాడని. దీంతో మొత్తం రూ.36 లక్షలు పోయాయి. సదరు బాలుడు ఇంటర్ చదువుతున్నాడు. దీనిపై ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరణించిన తన భర్త కష్టార్జితం మొత్తం బ్యాంకు ఖాతాలో ఉందని, భర్త మరణ పరిహారం కూడా దానిలో కలసి ఉందని చెప్పి వాపోవడం గమనార్హం.
mobile gaming
boy playing
spent
rs 36 lakh
amberpet

More Telugu News