Steve Waugh: డబ్ల్యూటీసీ ఫైనల్స్.. టీమిండియా జట్టు ఎంపికపై స్టీవ్ వా కామెంట్స్

  • భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న ఆస్ట్రేలియా
  • అశ్విన్ ను పక్కన పెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన స్టీవ్ వా
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం కూడా కరెక్ట్ కాదన్న ఆసీస్ దిగ్గజం
Steve Waugh comments on Team India selection

లండన్ లోని ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో టీమిండియా తేలిపోయిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 469 పరుగులు చేయగా ఇండియా 296 పరుగులకే చేతులెత్తేసింది. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ప్రస్తుతానికి ఆసీస్ 296 పరుగుల భారీ లీడ్ లో ఉంది. ఆటకి ఇంకా రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఆసీస్ ఆధిక్యత భారీగా పెరిగే అవకాశం ఉంది. 

మరోవైపు టీమిండియా తుది జట్టు కూర్పు, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ పై ఇప్పటికీ గంగూలీ, రిక్కీ పాంటింగ్, సంజయ్ మంజ్రేకర్ వంటి వారు విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోనే బెస్ట్ స్పిన్ బౌలర్ అయిన అశ్విన్ ను పక్కన పెట్టడాన్ని వీరు తప్పుపట్టారు. ఇప్పుడు వీరి సరసన ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ కెప్టెన్ స్టీవ్ వా కూడా చేరాడు. 

2019లో ఓవల్ లో జరిగిన ఐదో టెస్ట్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 145 పరుగులతో ఓడిపోయిందని... ఇప్పుడు భారత్ కూడా అదే తప్పు చేసిందని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. ఓవల్ మైదానం ఎప్పుడూ చాలా ట్రిక్కీగా ఉంటుందని చెప్పాడు. పిచ్ పైకి చూడ్డానికి పచ్చగా ఉంటుందని, కానీ లోపల డ్రైగా ఉంటుందని అన్నాడు. ఈ మ్యాచ్ కి అశ్విన్ ను ఎంపిక చేస్తే బాగుండేదని చెప్పాడు. స్పిన్నర్ గానే కాకుండా, బ్యాట్ తో రాణించే సత్తా అశ్విన్ కు ఉందని అన్నాడు. అశ్విన్ ను పక్కన పెట్టడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించాడు. టెస్టుల్లో అశ్విన్ ఇప్పటి వరకు 474 వికెట్లు పడగొట్టిన విషయం గమనార్హం.

More Telugu News