Chandrababu: మంత్రుల గురించి కావాల్సినంత మ్యాటర్ ఉంది... ఫుట్ బాల్ ఆడుకోండి: చంద్రబాబు

  • మంగళగిరిలో ఐ-టీడీపీ సదస్సు
  • సోషల్ మీడియా వింగ్ కు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
  • ఏపీ మంత్రులపై టీడీపీ అధినేత విమర్శనాస్త్రాలు
  • మంత్రులకు ఒరిజినాలిటీ లేదని వెల్లడి
Chandrababu slams AP ministers

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఐ-టీడీపీ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వైసీపీ మంత్రులపై విమర్శనాస్త్రాలు సంధించారు. తనను తిట్టడం, టీడీపీ వాళ్లు ఏమీ చేయలేదని చెప్పడమే ఈ మంత్రుల పని అని అన్నారు. వీళ్లకు ఒరిజినాలిటీయే లేదని వ్యాఖ్యానించారు. 

"సొంత నియోజకవర్గంలో ఒక పిల్ల కాల్వ తవ్వలేని వాడు ఇరిగేషన్ శాఖా మంత్రి. నియోజకవర్గంలో పట్టుమని పది ఇళ్లు కట్టించలేని వాడు హౌసింగ్ శాఖ మంత్రి. ఇండస్ట్రీల గురించి చెప్పవయ్యా అంటే ఇంకొకాయన కోడిగుడ్డు కథ చెబుతాడు... ఆయన ఇండస్ట్రీస్ శాఖ మంత్రి. మరొకాయన ఉన్నాడు.. ఆర్థికశాఖ మంత్రి... అప్పుల శాఖ మంత్రి... నిద్రలేచినప్పటి నుంచి ఏది తాకట్టు పెట్టాలన్నదే ఆయనకు పని... ఆఖరికి రైతు బజార్లు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన మంత్రి ఆయన. ఇక విద్యార్థుల జీవితాలు నాశనం చేసిన వాడు విద్యామంత్రి... వీళ్లు రాష్ట్ర మంత్రులు. వీళ్ల గురించి కావాల్సినంత మ్యాటర్ ఉంది... గ్రౌండ్ తెరిచే ఉంది... ఫుట్ బాల్ ఆడుకోండి" అంటూ చంద్రబాబు ఐ-టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 

చంద్రబాబు తన ప్రసంగంలో అమరావతి అంశాన్ని కూడా ప్రస్తావించారు. అమరావతి ఎక్కడికీ పోదని, ఏపీ రాజధాని విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మరో 9 నెలల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, తాము వచ్చాక అమరావతి పనులను పరుగులు తీయిస్తామని చెప్పారు. 

అమరావతి పేరు వింటే స్వర్గం, దేవతల రాజధాని గుర్తొస్తుందని అన్నారు. అలాంటి అమరావతిని చెడగొట్టడానికి ఈయనకు (జగన్) ఎలా బుద్ధి పుట్టిందో అర్థం కావడంలేదని చంద్రబాబు విమర్శించారు.

More Telugu News