Ajinkya Rahane: ఆరంభంలోనే కేఎస్ భరత్ అవుట్... పట్టుదలగా ఆడి ఫిఫ్టీ చేసిన రహానే

  • డబ్ల్యూటీసీ టెస్టులో టీమిండియా ఎదురీత
  • ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 469 ఆలౌట్
  • భారత్ స్కోరు 6 వికెట్లకు 220 పరుగులు
  • నిలకడగా ఆడుతున్న రహానే, శార్దూల్ ఠాకూర్
  • ఇంకా 249 రన్స్ వెనుకబడి ఉన్న టీమిండియా
Rahane completes fifty

ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఎదురీత కొనసాగుతోంది. మూడో రోజు ఆట ఆరంభంలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓవర్ నైట్ స్కోరు 151-5తో బరిలో దిగిన భారత్... రెండో బంతికే కేఎస్ భరత్ వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన భరత్... స్కాట్ బోలాండ్ విసిరిన బంతికి బౌల్డ్ అయ్యాడు. 

అయితే, ఆ తర్వాత వచ్చిన శార్దూల్ ఠాకూర్ పరిస్థితులకు తగినట్టుగా ఆడడంతో స్కోరుబోర్డు ముందుకు కదిలింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన అజింక్యా రహానే మరింత పట్టుదలతో ఆడి ఫిఫ్టీ సాధించడం ఇవాళ్టి తొలి సెషన్ లో హైలైట్ గా నిలిచింది. శార్దూల్ ఠాకూర్ తో కలిసి రహానే కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 

వీరిద్దరి సమయోచిత ఆటతీరుతో టీమిండియా స్కోరు 200 మార్కు దాటింది. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 52 ఓవర్లలో 6 వికెట్లకు 220 పరుగులు చేసింది. రహానే 65, శార్దూల్ ఠాకూర్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా ఇంకా 249 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 2, మిచెల్ స్టార్క్ 1, పాట్ కమిన్స్ 1, కామెరాన్ గ్రీన్ 1, నాథన్ లైయన్ 1 వికెట్ తీశారు.

More Telugu News