Telangana: ప్రతిపక్షాల సమావేశానికి కేసీఆర్ దూరం.. కారణం ఇదే!

  • 23న పాట్నాలో జరిగే సమావేశానికి రానని బీహార్ సీఎం నితీష్ కు సమాచారం 
  • కాంగ్రెస్ తో కూడిన కూటమిలో చేరేందుకు నిరాకరిస్తున్న బీఆర్ఎస్ అధినేత
  • అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న బీఆర్ఎస్
KCR to skip Oppn meet keeps equal distance from Congress and BJP

దేశ రాజకీయాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు ఆలోచనలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా బీజేపీపై ఒంటికాలుపై లేచిన కేసీఆర్ కొన్ని రోజులుగా ఆ పార్టీ పేరే ఎత్తడం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు ఏకం అవుతున్న  ప్రతిపక్షాల కూటమితో జట్టు కట్టేందుకు వెనకడుగు వేస్తున్నారన్న అభిప్రాయాలు వస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా ఈ నెల 23న పాట్నాలో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ప్రముఖ ప్రతిపక్ష పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు కేసీఆర్ ఈ విషయాన్ని తెలియజేశారు. కాంగ్రెస్‌ ఉన్న ప్రతిపక్షాల భాగం అయ్యేందుకు కేసీఆర్ ఇష్టపడడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

‘కేసీఆర్ ఎప్పుడూ కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ గురించే మాట్లాడారు. పాట్నాలో జరిగే సమావేశం ఆయన భావిస్తున్న ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ఉంది. ఆయన కాంగ్రెస్‌తో వేదిక పంచుకోబోరు’ అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చెప్పినట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన పోటీదారుగా భావిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల సమావేశానికి గైర్హాజరవుతున్నారని తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న పార్టీతో ఉమ్మడి వేదికను పంచుకోవడం ఎన్నికల సంవత్సరంలో ఓటర్లకు విరుద్ధమైన సంకేతాలను పంపుతుంది.

More Telugu News