Agni Prime: రాత్రివేళ 'అగ్ని ప్రైమ్' క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్

  • అగ్ని క్షిపణుల శ్రేణిలో కొత్త క్షిపణి
  • ఒడిశాలోని కలాం దీవి నుంచి గతరాత్రి అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం
  • ఆశించిన ఫలితాలు వచ్చాయన్న డీఆర్డీవో
  • హర్షం వ్యక్తం చేసిన రాజ్ నాథ్ సింగ్
Agni Prime night version missile successfully test fired

శత్రు భీకర అగ్ని క్షిపణుల శ్రేణిలో కొత్త తరం క్షిపణి చేరింది. దీని పేరు అగ్ని ప్రైమ్. ఈ బాలిస్టిక్ క్షిపణి రాత్రివేళ కూడా ప్రయాణించగలదు. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి అగ్ని ప్రైమ్ క్షిపణిని గత రాత్రి ప్రయోగించారు. ఈ పరీక్ష విజయవంతం అయిందని డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) వెల్లడించింది. 

అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను భారత సాయుధ దళాలకు అప్పగించే ముందు రాత్రివేళ నిర్వహించిన మొట్టమొదటి ప్రయోగం ఇది. ఇదివరకు మూడు సాధారణ పరీక్షలు జరపగా, అన్ని పర్యాయాలు విజయవంతం అయ్యాయి.

తాజా ప్రయోగం ద్వారా ఈ క్షిపణి కచ్చితత్వం, విశ్వసనీయతలను అంచనా వేశారు. వేర్వేరు ప్రాంతాల్లో రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి అగ్ని ప్రైమ్ రాత్రివేళ ప్రయోగాన్ని పరిశీలించారు. రెండు డౌన్ రేంజి నౌకలు కూడా అగ్ని ప్రైమ్ గమన మార్గంపై కన్నేసి ఉంచాయి. 

తాజా ప్రయోగం సఫలం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో పరిశోధకులను, సాయుధ దళాలను అభినందించారు. ఈ ప్రయోగంతో... రాత్రివేళల్లోనూ దూసుకెళ్లగల అధునాతన క్షిపణి సాంకేతికతను భారత్ అందిపుచ్చుకున్నట్టయింది.

More Telugu News