Chandrababu: ఏపీలో ఉన్నత విద్యా రంగాన్ని నాశనం చేశారు: చంద్రబాబు

  • జాతీయ స్థాయిలో విద్యాసంస్థల ర్యాంకులు విడుదల చేసిన ఎన్ఐఆర్ఎఫ్
  • ఏపీ విద్యాసంస్థల ర్యాంకులు దారుణంగా పడిపోయాయన్న చంద్రబాబు
  • 2019లో ఆంధ్రా వర్సిటీ 29వ స్థానంలో ఉందని వెల్లడి
  • 2023లో 76వ స్థానానికి దిగజారిందని ఆవేదన
  • ఎస్వీ యూనివర్సిటీ టాప్-100లో కూడా లేదని వివరణ
Chandrababu reacts on NIRF rankings

రాష్ట్రంలో యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉన్నత విద్యా వ్యవస్థ కుప్పకూలిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు ఏపీలో ఉన్నత విద్యా రంగాన్ని క్రమపద్ధతిలో నాశనం చేశాయని విమర్శించారు. ఈ  మేరకు ఆయన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులను ఉదహరించారు. 

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులను పరిశీలిస్తే, మన రాష్ట్రంలోని విద్యాసంస్థలు 2019 నుంచి ఓవరాల్ ర్యాంకింగ్స్ లో ఎలా స్థిరంగా పతనమవుతున్నాయో అర్థమవుతుందని తెలిపారు. 2019లో ఆంధ్రా యూనివర్సిటీ 29వ స్థానంలో ఉందని, అదే ఆంధ్రా యూనివర్సిటీ 2023లో 76వ ర్యాంకుకు పడిపోయిందని చంద్రబాబు వెల్లడించారు. 

ఎంతో ప్రతిష్ఠాత్మక ఎస్వీ యూనివర్సిటీ కనీసం టాప్-100లో కూడా చోటు దక్కించుకోలేకపోయిందని వివరించారు. టాప్-100 పరిశోధక విద్యాసంస్థల్లో ఏపీ నుంచి ఒక్క సంస్థ కూడా లేదని తెలిపారు. విద్యారంగానికి కేటాయించిన నిధులు వైసీపీ ఖజానాలోకి దారిమళ్లాయని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు గత నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 

అంతేగాకుండా, రాష్ట్రంలోని విద్యాసంస్థలు వైసీపీ రాజకీయ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు వేదికలుగా మారాయని విమర్శించారు. ఏపీలో విశ్వవిద్యాలయాలు ఇంకెంత భ్రష్టుపట్టిపోయాయో అంచనా వేయాల్సి ఉందని పేర్కొన్నారు.

More Telugu News