Prabhas: తనలోని రాముడిని ప్రభాస్ పైకి తీసుకొస్తున్నాడు: 'ఆదిపురుష్' ఈవెంటులో చినజీయర్ స్వామి

  • తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన చినజీయర్ స్వామి
  • మానవజాతి మనుగడకు మార్గం చూపినవాడు రాముడని వ్యాఖ్య 
  • ఇది అరణ్యకాండ .. యుద్ధకాండలోని కథ అంటూ వివరణ
  • ఈ తరానికి కావలసిన టెక్నాలజీతో వస్తున్న సినిమా అంటూ ప్రశంస   
Adi Purush Pre Release Event

రామాయణ ఇతివృత్తంతో వివిధ భాషల్లో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో .. ఇంత భారీ బడ్జెట్ లో రూపొందడం మాత్రం ఇదే మొదటిసారి. ప్రభాస్ కి గల క్రేజ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. 

ఈ వేదికపై చినజీయర్ స్వామి మాట్లాడుతూ .. "సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమంలో, మాలాంటివారు పాల్గొనడం ఇది మొదటిసారి. దానికి కారణం నిజమైన బాహుబలి శ్రీరాముడని లోకానికి నిరూపించడం కోసమే అనుకోవాలి. ప్రతి వ్యక్తిలోనూ .. ప్రతి గుండెలోను రాముడున్నాడు. ఆ రాముడిని బయటికి తీసుకుని రావడానికి, శ్రీమాన్ ప్రభాస్ తనలోని రాముడిని పైకి తీసుకుని వస్తున్నారు" అని అన్నారు.

మానవజాతి మనుగడకు మార్గాన్ని చూపించింది శ్రీరాముడే. ఆయన ఈ మట్టిపై నడిచిన మహా పురుషుడు. మానవజాతికి ఆధారమైనవాడు. ప్రజలను ధర్మమార్గంలో నడిపించడానికి రాముడు మానవుడయ్యాడు. రామాయణంలో 'అరణ్యకాండ' .. 'యుద్ధకాండ'లోని ప్రధానమైన కథను చరిత్రగా లోకానికి అందించాలనే ఆశతో ఈ సినిమా చేస్తున్నట్టుగా చెప్పారు. ఇంతకంటే ఈ లోకానికి మహోపకారం మరొకటి ఉండదు.

రామాయణం గురించి చెప్పే సినిమాలు ఇంతకుముందు చాలానే వచ్చాయి .. కానీ ఆ తరం వేరు. ఇప్పటి తరానికి మళ్లీ రాముడు కావాలి. ఇప్పటి టెక్నాలజీకి సంబంధించిన రాముడు కావాలి. అలాంటి ఒక టెక్నాలజీతో ఈ సినిమాను ప్రపంచం ముందుకు తీసుకుని వెళుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక మంచి ప్రయత్నం చేసిన ఈ సినిమా టీమ్ కి మంగళాశాసనాలు చేస్తున్నాము" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News