Telangana University: తెలంగాణ యూనివర్శిటీలో విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు

  • వైస్ ఛాన్సెలర్ పై అవినీతి ఆరోపణలు
  • ఈనెల 3న హైదరాబాద్ లో జరిగిన పాలకమండలి సమావేశం
  • వీసీపై శాఖాపరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్న నవీన్ మిట్టల్
Vigilance raids in Telangana University

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్శిటీలో విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. యూనివర్శిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, అకౌంట్స్ సెక్షన్, ఏవో సెక్షన్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్లలో సోదాలు చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దాడులను నిర్వహించారు. 

హైదరాబాద్ లోని రూసా భవన్ లో ఈ నెల 3న పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గతంలో పాలకమండలి తీసుకున్న నిర్ణయాలపై లోతుగా చర్చించారు. వైస్ ఛాన్సెలర్ చేసిన అక్రమ నియామకాలు, దినసరి ఉద్యోగం కింద పని చేసిన వారికి ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతి లేకుండానే బ్యాంకు నుంచి రూ. 28 లక్షలు చెల్లించిన అంశం, ఇతరుల పేర్ల మీద బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేయడం వంటి వాటిపై చర్చ జరిపారు. 

మరోవైపు ఈ సమావేశానికి వీసీ రవీందర్ గుప్తా హాజరు కాకపోవడం గమనార్హం. ఈ అవినీతి ఆరోపణలపై కమిటీ వేసి, చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇంకోవైపు వీసీ రవీందర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందని విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 

More Telugu News