BJP: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పొత్తు?

  • కర్ణాటకలో త్వరలో గ్రేటర్ బెంగళూరు, పంచాయతీ ఎన్నికలు
  • ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా బీజేపీ, జేడీఎస్ పొత్తుపై నిర్ణయం?
  • బీజేపీ కీలక నేతలతో కుమారస్వామి చర్చలు జరిపినట్లు ప్రచారం
  • ‘చూద్దాం’ అంటూ పొత్తులపై వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం
jds bjp likely to work together to take on congress govt in ls elections

కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. కర్ణాటకలో కొత్త ‘పొత్తు’ పొడుస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కలిసి పోటీ చేసేలా అడుగులు పడుతున్నాయి. ఈ విషయంలో స్పష్టమైన ప్రకటనలు రాకున్నా.. రెండు వైపులా చర్చలు జరుగుతున్నాయి.   

ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ ను మట్టికరిపించి కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు నెలలు కూడా గడవకముందే.. కర్ణాటకలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగా బీజేపీ, జేడీఎస్ చేతులు కలిపే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి ఢిల్లీలో పర్యటించడం.. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేవెగౌడ హాజరుకావడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఈ పర్యటనలో బీజేపీ కీలక నేతలతో కుమారస్వామి చర్చలు జరిపినట్లుగానూ ప్రచారం సాగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లడంపై కుమారస్వామి తాజాగా స్పందిస్తూ.. ‘‘సొంతంగా మా పార్టీని అభివృద్ధి చేసేందుకే మా ప్రాధాన్యత. చూద్దాం ఏమవుతుందో!’’ అని చెప్పడం గమనార్హం.

లోక్ సభ ఎన్నికలకు జేడీఎస్ ఒంటరిగా వెళ్తుందా? లేక పొత్తులతో వెళ్తుందా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టంమని జేడీఎస్ నేత ఒకరు అన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి పోటీ చేయగా.. చెరో సీటుతో సరిపెట్టుకున్నాయి.

More Telugu News