Nimmala Rama Naidu: ఏటి గట్టునే నిద్ర, స్నానం.. నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన.. అరెస్టు చేసిన పోలీసులు!

  • దళితుల భూముల్లో మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా నిమ్మల రామానాయుడు నిరసన
  • ఎలమంచిలి మండలం చించినాడలో ఏటిగట్టుపై ధర్నా.. రాత్రి అక్కడే బస
  • ఎన్ని రోజులైనా దళితులకు అండగా ఉంటానని ప్రకటన
  • తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఈ రోజు అరెస్టు చేసిన పోలీసులు
west godavari tdp mla nimmala ramanaidu arrested

దళితుల భూముల్లో మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దళితులకు మద్దతుగా రామానాయుడు చేపట్టిన ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేయనీయకుండా టీడీపీ నాయకులు, స్థానికులు అడ్డుకున్నారు. తర్వాత పోలీసులు లాఠీచార్జ్ చేసి రామానాయుడిని స్టేషన్ కు తరలించారు. 

అంతకుముందు ప్రభుత్వ తీరుకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ వద్ద దళితుల భూముల్లో సోమవారం రాత్రి బస చేశారు. మరుసటి రోజు ఉదయం పెరుగులంక సమీపంలో గోదావరి ఒడ్డున ఆరుబయటే స్నానం చేశారు. దళితులతో కలిసి అక్కడే అల్పాహారం తీసుకున్నారు. 

‘‘దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా, పేదలకు అండగా నిన్న పెరుగులంక గోదావరి ఏటిగట్టుపై ధర్నా చేశాను. రాత్రి అక్కడే బస చేశాను. ఎన్ని రోజులైనా దళితులకు అండగా ఉంటా’’ అని నిమ్మల రామానాయుడు ట్వీట్ చేశారు. రాత్రి ఏటి గట్టుపై నిద్రించేందుకు వెళ్తున్నట్లు మరో ట్వీట్ చేశారు. 

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నిమ్మల రామానాయుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిమ్మలను అరెస్ట్ చేయనీయకుండా దళితులు, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. రామానాయుడిని అదుపులోకి తీసుకుని.. పాలకొల్లు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

More Telugu News