Andhra Pradesh: కొడుకు, కోడల్ని ఎయిర్ పోర్ట్ లో దింపి, ఇంటికి తిరిగి వెళ్తూ కారు ప్రమాదంలో తండ్రి మృతి

  • థాయిలాండ్ వెళ్తున్న కొడుకు, కోడలు
  • సాగనంపేందుకు ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన తల్లిదండ్రులు
  • తిరిగి వెళ్తుండగా కారుకు ప్రమాదం
  • ఆసుపత్రికి తరలిస్తుండగా తండ్రి మృతి
AP farmer died in car accident in mahabubnagar

సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న కొడుకు, కోడలుకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయని ఆ తల్లిదండ్రులు సంతోషపడ్డారు. సాగనంపేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కారులో వెళ్లారు. తిరిగి ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరగడంతో కారులో నుంచి తండ్రి ఎగిరి బయటపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. విషయం తెలిసి కడచూపు కోసం కొడుకూకోడలు తిరిగి ఇండియా వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా గని గ్రామానికి చెందిన రైతు పరమేశ్వరప్ప ఈ ప్రమాదంలో చనిపోయారు. మానవపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరమేశ్వరప్ప కొడుకు సాయి తేజప్ప, కోడలు మౌనిక హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. ఇటీవల థాయిలాండ్ లో ఉద్యోగం రావడంతో భార్యాభర్తలు ఇద్దరూ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఫ్లైట్ కు టికెట్లు బుక్ చేసుకున్న ఈ భార్యాభర్తలకు సెండాఫ్ ఇచ్చేందుకు పరమేశ్వరప్ప, ఆయన భార్య శివలక్ష్మి గ్రామం నుంచి కారులో హైదరాబాద్ వచ్చారు. అంతా కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. కొడుకుకోడలు విమానం ఎక్కాక పరమేశ్వరప్ప దంపతులు గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు.

ఈ క్రమంలో మానవపాడు మండలంలోని బోరవెల్లి స్టేజీ దాటాక డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారుకు ప్రమాదానికి గురైంది. హైవే పక్కన ఉన్న కిలోమీటర్ రాయిని బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో కూర్చున్న పరమేశ్వరప్ప ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. శివలక్ష్మితో పాటు కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. తలకు బలమైన గాయాలు కావడంతో పరమేశ్వరప్పను అంబులెన్స్ లో కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన చనిపోయాడు. తండ్రి మరణవార్త విని సాయి తేజప్ప భార్యతో కలిసి థాయిలాండ్ నుంచి తిరిగి వచ్చాడు. కాగా, శివలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు మానవపాడు పోలీసులు తెలిపారు.

More Telugu News