Jagan: ఎంవోయూల అమలుపై సీఎం జగన్ కీలక సమావేశం

  • మార్చి నెలలో విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు
  • రూ.13 లక్షల కోట్ల పెటుబడులు రాబట్టినట్టు సీఎం వెల్లడి
  • వివిధ శాఖల అధికారులతో నేడు సీఎం సమీక్ష
CM Jagan held review meeting on MoUs

ఏపీలో తమ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టిందని ఇటీవల సీఎం జగన్ పలు వేదికలపై స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో, ఇటీవల విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారులతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ఏపీ సర్కారు దృష్టి సారించింది. వివిధ కంపెనీలతో విశాఖ సదస్సులో కుదుర్చుకున్న ఎంవోయూల అమలుపై నేడు సీఎం జగన్ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎంవోయూల పరిస్థితి ఏంటి, వాటి అమలు ఎంత వరకు వచ్చింది అనే అంశాలపై చర్చించారు. 

విశాఖట్నంలో మార్చి 3, 4 తేదీల్లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ ప్రభుత్వం మొత్తం 387 ఎంవోయూలు కుదుర్చుకుంది. వాణిజ్యం, ఇంధన, ఐటీ, టూరిజం, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖలకు సంబంధించిన ఈ ఒప్పందాల విలువ రూ.13,12,120 కోట్లు అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. 

అయితే, వీటిలో ఎగుమతుల వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రధానంగా చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులపై శ్రద్ధ చూపించాలని సీఎం జగన్ నేటి సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎంఎస్ఎంఈల కోసం వేటికవే ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని, ప్రాధాన్యత ఆధారంగా వాటి పురోగతిపై పరిశీలిస్తుండాలని సూచించారు.

More Telugu News