sugarcane juice: చెరకు రసం.. అస్సలు విడిచి పెట్టొద్దు..! 

  • చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్
  • శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను భర్తీ చేసే పానీయం
  • కాలేయ ఆరోగ్యానికి ఎంతో మంచిది
  • గ్లైసిమిక్స్ ఇండెక్స్ తక్కువ కావడం వల్ల వెంటనే షుగర్ పెరగదు
health benefits of sugarcane juice

వేసవి అనే కాకుండా అన్ని కాలాల్లోనూ చెరకు రసం లభిస్తుంటుంది. కాకపోతే ఎక్కువ మంది వేసవిలోనే దీన్ని తాగుతూ ఉంటారు. కొందరిలో చెరకు రసం తాగితే షుగర్ పెరుగుతుందేమోనన్న భయం ఉంటుంది. దీనిపై పలువురిలో కొన్ని సందేహాలు, అపోహలు ఉంటుంటాయి. నిజానికి చెరకు రసం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. 

హైడ్రేషన్
శరీరంలో తేమను కాపాడడంలో ఇది మంచి పానీయం. శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ ను అందిస్తుంది. అందుకే వేసవిలో ఇది అమృతం వంటి పానీయం. వేసవిలో అధిక వేడి కారణంగా శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది. అలాంటి సందర్భాల్లో గ్లాసు చెరకు రసం తాగడం మంచిది.

పోషకాలు
చెరకు రసంలో కేవలం తీపి ఒక్కటే ఉందనుకోవద్దు. విటమన్ ఏ, సీ, బీ తోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. శరీరంలో ఎన్నో ముఖ్య కార్యకలాపాలకు ఇవి అవసరం.

శక్తినిస్తుంది..
చెరకు రసం తక్షణ శక్తినిస్తుంది. కనుక ఎండలో వెళ్లే వారు, చురుగ్గా పనిచేసేవారు, క్రీడాకారులకు ఇది మంచి పానీయం అవుతుంది. నీరసంతో బాధపడుతున్న వారికి ఇవ్వొచ్చు.

జీర్ణాశయ ఆరోగ్యం
ఇది సహజ విరేచనకారిగా పనిచేస్తుంది. ఇందులోని గ్లైకోలిక్ యాసిడ్ చర్మానికి మంచిది. తేజస్సును కాపాడుతుంది. కాలేయాన్ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. దీంతో కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. 

రోగ నిరోధక శక్తి
విటమిన్ సీతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి దీనితో బలపడుతుంది. ఫలితంగా వ్యాధులపై పోరాడే శక్తి పెరుగుతుంది. 

బరువు తగ్గడం
చెరకు రసంలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. కనుక తాగితే రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుందని అనుకోవద్దు. కొంత మేరే పెరుగుతుంది. నిదానంగా విడుదల అవుతుంది. దీనివల్ల బరువు పెరగకుండా ఉంటారు. అయితే, ఇన్ని ప్రయోజనాలున్నాయని చెప్పి రోజూ రెండు మూడు గ్లాసులు తాగేయకండి. మితంగా తీసుకుంటేనే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. రోజూ  200 ఎంఎల్ వరకు తీసుకోవచ్చు.

More Telugu News