Peddireddi Ramachandra Reddy: ముందస్తు ఎన్నికలు, పొత్తులపై క్లారిటీ ఇచ్చిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి

  • ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదన్న పెద్దిరెడ్డి  
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి
  • చంద్రబాబు రాజకీయ వైకల్యంతో బాధపడుతున్నారని ఎద్దేవా
  • అందుకే ఇతరుల సాయం కోసం ఎదురుచూస్తున్నారని విమర్శ
ap minister peddireddy clarity on early elections

ఏపీలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయంటూ వస్తున్న ఊహాగానాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయని చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు రాజకీయ వైకల్యంతో బాధపడుతున్నారని, అందుకే ఇతరుల సాయం కోసం ఎదురుచూస్తున్నారని విమర్శించారు. ‘‘వైసీపీ బలంగా ఉంది. మాకు వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు.. వేరే పార్టీలపై ఆధారపడుతున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురించి నేనేమీ మాట్లాడను’’ అని అన్నారు.

‘‘మహానాడులో చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కర్ణాటక మేనిఫెస్టోను, జగన్ మేనిఫెస్టోను కాపీ కొట్టారు. ఆయనకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకొస్తారు’’ అని పెద్దిరెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం లేకనే బీజేపీతో పొత్తుకోసం ఢిల్లీకి వెళ్లారన్నారు.

More Telugu News