Bridge Collapse: బీహార్ లో కూలిపోయిన వంతెన.. బలమైన గాలులే కారణమట.. వీడియో ఇదిగో!

  • రూ.1,710 కోట్ల ఖర్చుతో, నాలుగు లేన్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి
  • 2014లో పనులు ప్రారంభం.. వచ్చే నవంబర్ లో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
  • గతేడాది ఏప్రిల్ లోనూ కొంతభాగం కూలిన తీగల వంతెన
Aguwani Sultanganj Bridge Collapse in Bihar

బీహార్ లో ఓ వంతెన కడుతుండగానే కూలిపోయింది. నాలుగు లేన్లతో నిర్మిస్తున్న ఈ తీగల వంతెనలో కొంత భాగం ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనను అక్కడ ఉన్నవారు తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియోలు వైరల్ గా మారాయి. ఈ ప్రమాదంపై సీఎం నితీశ్ కుమార్ విచారణకు ఆదేశించారు. కాగా, గతేడాది ఏప్రిల్ లోనూ ఈ బ్రిడ్జి కొంతమేర కూలిపోయింది.

రాష్ట్రంలోని ఖగారియా, భాగల్ పూర్ జిల్లాలను కలుపుతూ బీహార్ ప్రభుత్వం గంగా నదిపై నాలుగు లేన్లతో బ్రిడ్జి నిర్మాణం తలపెట్టింది. అగువాని సుల్తాన్ గంజ్ పేరుతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి కోసం ప్రభుత్వం రూ.1,710 కోట్లు వెచ్చించింది. సీఎం నితీశ్ కుమార్ చేతుల మీదుగా 2014లో బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలయ్యాయి. వచ్చే నవంబర్ నాటికి పనులు పూర్తిచేసి బ్రిడ్జిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఆదివారం ఈ బ్రిడ్జిలోని కొంత భాగం నదిలో కూలిపోయింది. బలమైన గాలుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. 

బ్రిడ్జి కూలిన ఘటనపై అధికారులు స్పందిస్తూ.. ప్రమాద తీవ్రతను, నష్టం వివరాలను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పిల్లర్, సెగ్మెంట్ కూలిపోయాయని, ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదని వారు చెప్పారు. నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజనీర్లతో నష్ట తీవ్రతపై చర్చించినట్లు భాగల్‌పూర్ ఎస్డీఓ ధనంజయ్‌ కుమార్‌ తెలిపారు.

More Telugu News