Anam Ramanarayana Reddy: ఇక్కడ వలంటీర్ కు ఉన్న అధికారం ఎమ్మెల్యేకి కూడా లేదు: ఎమ్మెల్యే ఆనం

Anam Ramanarayana Reddy slams YCP ruling
  • ఏపీలో వైసీపీ దుర్మార్గపు పాలన కొనసాగుతోందన్న ఆనం
  • అంతమొందించడానికి అందరూ కలిసిరావాలని పిలుపు
  • ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సర్పంచిలకు అధికారం లేదని వ్యాఖ్యలు
  • రాష్ట్రాన్ని దోచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు
ఏపీలో వైసీపీ దుర్మార్గపు పాలన కొనసాగుతోందని, అంతమొందించడానికి అందరూ కలిసి రావాలని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. 

రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు అధికారం లేదు, ఎంపీలకు అధికారం లేదు, గ్రామానికి అధ్యక్షుడైన సర్పంచికి కూడా అధికారం లేదు అని వెల్లడించారు. వాలంటీర్ కు ఉన్న అధికారం ఇక్కడ ఎమ్మెల్యేకి లేదని, ఈ విషయం చెప్పడానికి తానేమీ బాధపడడంలేదని తెలిపారు. ఈ నాలుగేళ్లలో అన్ని చూసి, ఇప్పుడు దూరంగా ఉంటున్నానని అన్నారు. 

రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల నుంచి గ్రామపంచాయతీ సమావేశాల వరకు దేనికీ విలువ లేకుండా పోయిందని తెలిపారు. 

ప్రతి మంగళవారం రూ.3 వేల కోట్లు అప్పులు తెస్తున్నారని, ఆ లెక్కన ఎన్ని మంగళవారాలు వస్తాయి, అప్పు ఎంతవుతుంది? అని ఆనం ప్రశ్నించారు.

"పోలవరం ప్రాజెక్టు కట్టలేమని నిలిపివేశారు. పవర్ ప్రాజెక్టులు అమ్మేసే పరిస్థితికి వచ్చారు. ప్రారంభానికి ముందే అమ్మకం టెండర్లు పిలిచే పాలన ఎక్కడైనా ఉందా? అందుకు ఉదాహరణ కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టు. ప్రారంభోత్సవానికి ముందే 99 ఏళ్ల లీజుకు టెండర్లు పిలిచారు. ఇవాళ జనం కూడా నవ్వులపాలవుతున్నారు. ఏపీ ప్రజలను చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు నవ్వుకుంటున్నారు. 

ఇవాళ ఏపీలో ఒక లే అవుట్ వేసి ఒక ప్లాట్ అమ్మేవాడు కనిపించడంలేదు... లే అవుట్  వేసినా, బిల్డింగ్ కట్టినా, అలాంటివాళ్లు తెలంగాణలో ఉన్నారు. ఎందుకున్నారంటే... అక్కడ వ్యాపారాలు బాగున్నాయి, అక్కడి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది కాబట్టే ఉన్నారు. నాడు అమరావతి అంటూ వచ్చిన వారందరూ గోడకు కొట్టిన బంతిలా తిరిగి వెళ్లిపోయారు. ఏపీ నుంచి హైదరాబద్ వెళ్లినవారు అప్పట్లో కోడిపందాలకైనా వచ్చేవారు, ఇప్పుడు ఆ కోడిపందాలకు కూడా రావడంలేదు" అని ఆనం వివరించారు.
Anam Ramanarayana Reddy
YSRCP
Andhra Pradesh
Telangana

More Telugu News