Supreme Court: ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్

odisha train accident pil filed in supreme court balasore train mishap
  • రైల్వేలో రిస్క్‌, సేఫ్టీ కొలమానాలను విశ్లేషించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలన్న పిటిషనర్
  • ‘కవచ్’ను వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలను జారీ చేయాలని విజ్ఞప్తి
  • కమిషన్ తన నివేదికను రెండు నెలల్లో కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలని వ్యాజ్యం 
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. రైల్వేలో రిస్క్‌, సేఫ్టీ కొలమానాలను విశ్లేషించి, రివ్యూ చేసి, సూచనలు జారీ చేసేలా ఓ కమిటీని ఏర్పాటు చేయాలంటూ పిటిషనర్ కోరారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో, నిపుణులతో కూడిన కమిషన్ ను ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సదరు నివేదికను సుప్రీంకు అందజేసేలా చూడాలని కోరారు.

సుప్రీం కోర్టు న్యాయవాది విశాల్‌ యివారీ ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రజా భద్రత దృష్ట్యా తక్షణమే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) సిస్టమ్‌ ‘కవచ్’ను అమలు చేసేలా మార్గదర్శకాలను జారీ చేయాలని కోరారు. ‘‘భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ జరగాలి. రైలు భద్రతకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాలి. కమిషన్ తన నివేదికను రెండు నెలల్లో కోర్టుకు సమర్పించాలి’’ అని కోరారు. 

శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 290 మందికిపైగా చనిపోయారు. 1,100 మందికి పైగా గాయపడ్డారు. 128 కిలోమీటర్ల వేగంతో వచ్చిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు.. గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో కొన్ని బోగీలు పక్కనున్న పట్టాలపై పడ్డాయి. ఇదే సమయంలో 124 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చిన హౌరా ఎక్స్ ప్రెస్.. బోగీలను ఢీకొని ప్రమాదానికి గురైంది. దీంతో చాలా బోగీలు నుజ్జునుజ్జయ్యాయి.
Supreme Court
Odisha
balasore train mishap
Train Accident
PIL

More Telugu News