Odisha train accident: విండో సీటు కోసం ఆ చిన్నారి పట్టుబట్టడమే తండ్రీబిడ్డల ప్రాణాలు కాపాడింది!

How Exchanging Seats Saved Lives Of Man And His 8 Year Old Daughter In Deadly Odisha Train Crash
  • ఒడిశా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో మిరాకిల్
  • చివరి నిమిషంలో వేరే ప్రయాణికులతో సీటు మార్చుకున్న తండ్రి
  • రైలు ప్రమాదంలో నుజ్జునుజ్జుగా మారిన వారు కూర్చోవాల్సిన కోచ్
  • సీటు మారడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ తండ్రీకూతుళ్లు

పిల్లలు దైవంతో సమానం అంటారు.. ఆ దైవమే పలికించిందో ఏమో కానీ ఓ ఎనిమిదేళ్ల చిన్నారి విండో సీటు కావాలని తండ్రిని కోరింది. నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. దీంతో టీసీతో మాట్లాడి వేరే ప్రయాణికులతో సీట్లు మార్పించుకున్నాడా తండ్రి. అలా మార్చుకోవడంవల్లే ఇప్పుడు ప్రాణాలతో ఉన్నామని చెప్పాడాయన. ఒడిశా రైలు ప్రమాదంలో చోటుచేసుకుందీ ఘటన. 

ఖరగ్ పూర్ కు చెందిన దేవ్ తన కూతురితో కలిసి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. అనారోగ్యంతో బాధపడుతున్న కూతురిని కటక్ లోని ఓ ఆసుపత్రిలో చూపించేందుకు తీసుకువెళుతున్నట్లు దేవ్ చెప్పారు. ట్రైన్ లోకి ఎక్కాక దేవ్ కూతురు విండో సీట్ కావాలని అడిగింది. అయితే, రిజర్వేషన్ ప్రకారం తమకు కేటాయించిన సీట్లలో విండో సీట్ లేకపోవడంతో కూతురుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశానని వివరించారు.

అయినా కూతురు వినకపోవడంతో టీసీతో మాట్లాడగా.. వేరే కోచ్ లో కూర్చున్న వారితో సీట్లు మార్పించారని తెలిపారు. రైలు ప్రమాదం తర్వాత స్వల్ప గాయాలతో తాము బయటపడ్డామని దేవ్ వివరించారు. ఆ తర్వాత పరిశీలించగా.. తాము కూర్చోవాల్సిన కోచ్ నుజ్జునుజ్జుగా మారిపోయిందని చెప్పారు. తమ ఒరిజినల్ సీట్ లో కూర్చున్న వారి పరిస్థితి ఎలా ఉందనేది తెలియదని దేవ్ చెప్పారు. వారు ప్రాణాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News