Sonu Sood: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు శాశ్వత పరిష్కారం కావాలన్న సోనుసూద్

Sonu Sood urges people to support victims of the Odisha train tragedy
  • సోషల్ మీడియాలో కన్నీరు కార్చి లాభం లేదు.. సాయం చేయాలని పిలుపు
  • ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం.. కానీ కుటుంబాలను నిలబెట్టాలి
  • ఇప్పుడు ప్రకటించే పరిహారం మూడు నాలుగు నెలల్లో ఖర్చవుతుందని వ్యాఖ్య
ఒడిశాలోని బాలాసోర్ రైళ్ల ప్రమాదం ఘటనపై ప్రముఖ నటుడు సోనుసూద్ స్పందించాడు. ప్రజలు కేవలం సోషల్ మీడియాలో కన్నీరు కార్చినంత మాత్రాన ఏమీ లాభం లేదని, సాధ్యమైనంత సాయం చేయాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఒడిశా రైలు ప్రమాద ఘటన హృదయ విదారకమైనదని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలోని మృతులకు సంతాపం తెలిపాడు. ఇలాంటి దురదృష్టకర సంఘటన పట్ల మనం మన మద్దతును, సానుభూతిని తెలపాల్సిన సమయమని పేర్కొన్నాడు. 

తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంతాపం తెలపడంతో పాటు వీడియో సందేశాన్ని ఇచ్చాడు. ఒడిశా రైలు ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు జీవితకాలం పెన్షన్లు లేదా స్థిరమైన నెలవారీ వేతనం చెల్లించాలని సోను సూద్ డిమాండ్ చేశాడు. ప్రమాదం నేపథ్యంలో ప్రతి ఒక్కరు సాయం చేసేందుకు ముందుకు రావాలన్నాడు. బాధితులకు కంటితుడుపు సహాయం కాకుండా శాశ్వత పరిహారం ఉండేలా చూడాలన్నారు.

ఇలాంటి ప్రమాదాల పట్ల మనం సోషల్ మీడియాలో ట్వీట్లు చేసి కన్నీరు కారుస్తామని, కానీ ఆ తర్వాత మన పనుల్లో మనం బిజీగా ఉండిపోతామని, కానీ జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలలో పనులు చేసుకుని నష్టపోయిన వారి పరిస్థితి, వారి కుటుంబాల పరిస్థితి ఏమిటన్నారు. రాత్రికి రాత్రే చాలా కుటుంబాలు చెదిరిపోయాయని, ఆ కుటుంబాలు మళ్లీ నిలబడే అవకాశం ఉందా అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ప్రకటించే పరిహారం మూడు నాలుగు నెలల్లో ఖర్చయిపోతుందని, ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్నాడు. 

కాళ్లు, చేతులు విరిగిపోయిన వారికి ఈ పరిహారంతో న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించాడు. ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని, కానీ ఏదో పరిహారం ప్రకటించి ఊరుకోకుండా ఆ కుటుంబాలను ఆదుకోవాలన్నాడు. ప్రతి ఒక్కరు కూడా బాధితులను ఆదుకునేందుకు బాధ్యతగా ముందుకు రావాలన్నాడు.
Sonu Sood
Train Accident
Odisha
Narendra Modi

More Telugu News