Ravi Shastri: కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసిరావాలి: రవిశాస్త్రి

  • ఇంగ్లండ్ గడ్డపై ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్
  • ట్రోఫీ కోసం ఓవల్ మైదానంలో భారత్, ఆసీస్ మధ్య టెస్టు సమరం
  • జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
  • పదేళ్ల నిరీక్షణకు భారత్ తెరదించుతుందన్న రవిశాస్త్రి
Ravi Shatri opines on WTC Final

ఈ నెల 7 నుంచి జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కోసం టీమిండియా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, మాజీ కోచ్, వ్యాఖ్యాత రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ టోర్నీల్లో గట్టి పోరాటానికి తోడు కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రావాలని అభిప్రాయపడ్డారు.  

టీమిండియా చివరిసారిగా ఐసీసీ ఈవెంట్ లో విజేతగా నిలిచింది 2013లో. ధోనీ సారథ్యంలో టీమిండియా నాడు ఐసీసీ ట్రోఫీ అందుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఐసీపీ టోర్నీల్లో భారత్ జట్టు చాంపియన్ గా నిలిచింది లేదు. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ రూపంలో టీమిండియా ముందు మంచి అవకాశం నిలిచింది. 

అయితే, క్రికెట్ పండితుల్లో అత్యధికులు ఆస్ట్రేలియానే ఫేవరెట్ అంటున్నారు. దీనిపై రవిశాస్త్రి స్పందిస్తూ, ఇది ఏకైక టెస్టు అని, కాబట్టి ఆసీస్ కూడా జాగ్రత్తగానే ఉండాలని స్పష్టం చేశారు. టెస్టు మ్యాచ్ లో ఒక్కరోజు సరిగా ఆడకపోయినా తీవ్ర ప్రభావం పడుతుందని, ఇది ఆస్ట్రేలియాకు కూడా వర్తిస్తుందని అన్నారు.

భారత్ టీమ్ కు ఐసీసీ ట్రోఫీ గెలిచే సత్తా ఉందని, గత మూడ్నాలుగేళ్లుగా మన జట్టులో చాంపియన్ అయ్యే లక్షణాలు గుర్తించానని, టీమిండియా ఆటగాళ్లలో ఆ శక్తి ఇప్పటికీ ఉందని భావిస్తున్నట్టు రవిశాస్త్రి తెలిపారు. 10 ఏళ్ల నిరీక్షణకు ఈసారి టీమిండియా తెరదించుతుందని నమ్ముతున్నానని వివరించారు.

More Telugu News