kota srinivasa rao: ‘రోజుకు 2 కోట్లు.. 6 కోట్లు తీసుకుంటున్నాం..’ అని చెప్పుకోవడమేంటి?.. సినీ హీరోలపై కోట శ్రీనివాసరావు విమర్శలు

senior actor kota srinivasa rao sensational comments star heroes remuneration
  • ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తమ రెమ్యునరేషన్ ఎంతో ఎప్పుడూ చెప్పుకోలేదన్న కోట
  • ఇప్పటి హీరోలు పబ్లిక్‌గా పారితోషకం గురించి చెప్పడం మంచి పద్ధతి కాదని వ్యాఖ్య
  • ఇప్పుడు సినిమా అనేదే లేదని, అంతా సర్కసేనని విమర్శ
  • విషాద గీతాలకు కూడా డ్యాన్స్ లు చేస్తున్నారని ఎద్దేవా
స్టార్‌ హీరోల రెమ్యునరేషన్‌, వాణిజ్య ప్రకటనలపై సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు విమర్శలు చేశారు. గతంలో ఏ హీరో తన రెమ్యునరేషన్‌ గురించి ఎక్కడా చెప్పేవారు కాదని, ఇప్పటి హీరోలు మాత్రం తాను రోజుకు రూ.2 కోట్లు, 6 కోట్లు తీసుకుంటున్నానని పబ్లిక్‌గా చెబుతున్నారని విమర్శించారు. పబ్లిక్‌గా పారితోషకం గురించి హీరోలు చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకల్లో కోట శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు? ఎవరు, ఎవరికి ఎంత ఇచ్చారు? ఎవరికైనా తెలుసా? వాళ్లు ఏనాడూ తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడలేదు. కానీ ఇప్పటి హీరోలు రోజుకి రూ.2 కోట్లు, రూ.6 కోట్లు తీసుకుంటున్నాం.. 40 కోట్లు.. 50 కోట్లు అని పబ్లిక్ గా చెబుతున్నారు’’ అని అన్నారు. అసలు ఇప్పుడు సినిమా అనేదే లేదని, అంతా సర్కసేనని ఎద్దేవా చేశారు. విషాద గీతాలకు కూడా డ్యాన్స్ లు చేస్తున్నారని సెటైర్లు వేశారు.

హీరోలు యాడ్స్ చేయడం గురించి మాట్లాడుతూ.. ‘‘బాత్రూమ్‌ క్లీన్‌ చేసే బ్రష్‌ నుంచి బంగారం ప్రకటనల దాకా అన్నీ స్టార్‌ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంది?’’ అని కోట ప్రశ్నించారు. ‘‘రెండు పూటలా భోజనం చేస్తున్న సినీ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారో మా అసోసియేషన్ గుర్తించాలి. చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారు. దయచేసి ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి చిన్న ఆర్టిస్టులను బతికించండి’’ అని కోరారు.

హీరోల రెమ్యునరేషన్‌ విషయంలో కోట చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించినవేనని నెటిజన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. ఆమధ్య పవన్ కల్యాణ్.. తాను రోజుకి రూ.రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.
kota srinivasa rao
star heroes remuneration
Pawan Kalyan
remuneration

More Telugu News