Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం: రక్తం ఇచ్చేందుకు ఆసుపత్రి ముందు క్యూ కడుతున్న జనం

  • ప్రమాద స్థలంలో 45 మొబైల్ హెల్త్ టీమ్ లు
  • అందుబాటులో 200 అంబులెన్స్ లు 
  • మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు
People Queue Up To Donate Blood To Those Injured

ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 238 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 900 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాణికుల బోగీలు తీవ్రంగా దెబ్బతినడంతో లోపల చిక్కుకున్న వారి పరిస్థితి దారుణంగా మారింది. కాళ్లు, చేతులు తెగిపడిపోయి అర్తనాదాలు చేస్తున్న వారు ఒక పక్క.. తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన వారు మరో పక్క.. బోగీలలో చిక్కుకుని సాయం కోసం అర్థిస్తున్న వారు ఇంకొక పక్క.. ప్రమాద స్థలంలో పరిస్థితి భయానకంగా ఉందని సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది చెప్పారు.

బోగీలలో చిక్కుకున్న వారిని బయటకు తీస్తూ అంబులెన్స్ లలో దగ్గర్లోని ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు సహాయక బృందాలు వెల్లడించాయి. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 200 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వెంటనే చికిత్స అందించేందుకు 45 మొబైల్ హెల్త్ టీమ్ లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. రైలు ప్రమాదం శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరగగా.. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగించినట్లు అధికారులు తెలిపారు.

ఆసుపత్రులకు చేరుతున్న క్షతగాత్రుల సంఖ్య పెరుగుతోంది. దీంతో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇతర ప్రాంతాల నుంచి డాక్టర్లను కూడా పిలిపించినట్లు అధికారులు తెలిపారు. గాయాల కారణంగా రక్తస్రావం జరగడంతో చాలా మంది బాధితులకు రక్తం అవసరమని వైద్యులు ప్రకటించారు. దీంతో రక్తదానం చేసేందుకు బాలాసోర్ ఆసుపత్రికి జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. బాధితులను ఆదుకోవడానికి తమ వంతు సాయంగా రక్తదానం చేయడానికి వచ్చినట్లు వారు చెబుతున్నారు.

More Telugu News