kapil dev: ఆ పతకాలు మీవి కాదు... తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి: రెజ్లర్లకు 1983 ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్ విజ్ఞప్తి

  • బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయకుంటే పతకాలు గంగానదిలో కలిపేస్తామని రెజ్లర్ల హెచ్చరిక
  • ఆ పతకాల్లో దేశ ప్రతిష్ఠ ఇమిడి ఉందని రెజ్లర్లకు కపిల్ సేన విజ్ఞప్తి
  • రెజ్లర్లపై పోలీసుల తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మాజీ క్రికెటర్లు
Dont Take Hasty Decisions  Kapil Dev Led 1983 Champions Urge Wrestlers

బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ప్రముఖ రెజ్లర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. బ్రిజ్ ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ తో వారు చాలా రోజులుగా నిరసన చేపడుతున్నారు. అతనిని అరెస్ట్ చేయకుంటే తాము గెలుచుకున్న పతకాలను హరిద్వార్ వద్ద గంగానదిలో కలిపేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం గడువు కూడా పెట్టారు. 

ఈ నేపథ్యంలో రెజ్లర్లకు 1983 క్రికెట్ ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్ ఓ సూచన చేసింది. ఆ పతకాలు మీవి కాదని, వాటి విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో రెజ్లర్లపై పోలీసుల తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. రెజ్లర్లతో దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలు కలవరపరిచాయని, ఎంతో శ్రమకోర్చి దేశం కోసం సాధించిన పతకాలను గంగానదిలో కలిపేద్దామనే వారి ఆలోచన ఆందోళన కలిగిస్తోందన్నారు. 

ఆ పతకాల వెనుక ఎంతో కృషి, త్యాగం ఉన్నాయన్నారు. అవి కేవలం వారికి లభించిన గుర్తింపు మాత్రమే కాదని, ఆ పతకాల్లో ఈ దేశ ప్రతిష్ఠ ఇమిడి ఉందన్నారు. ఈ విషయంలో వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, రెజ్లర్ల బాధలకు సాధ్యమైనంత త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

More Telugu News