Asaduddin Owaisi: ద్వితీయ శ్రేణి పౌరులుగా మారతామనే భయంతో ముస్లిలు ఓటు వేస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

  • ద్వేషపూరిత ఎజెండాను బీజేపీ ప్రచారం చేస్తోందన్న అసదుద్దీన్ ఒవైసీ
  • బీజేపీ ఎంచుకున్న ‘హిందుత్వ ఎజెండా’ ఆ పార్టీకి లాభాలు తెచ్చిపెడుతోందని వెల్లడి
  • ఇస్లాం ఎన్నటికీ ప్రమాదంలో పడబోదని, దేశమే ప్రమాదంలో ఉందని వ్యాఖ్య 
not islam constitution in danger says asaduddin owaisi

దేశంలో మతపరమైన విభజన అంటూ ఏదీ జరగడం లేదని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దేశంలో మెజారిటీ ప్రజల్లో ద్వేషపూరిత ఎజెండాను బీజేపీ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. గురువారం ఓ జాతీయ న్యూస్ చానల్ నిర్వహించిన చర్చలో అసదుద్దీన్ మాట్లాడారు. ‘‘బీజేపీ ఎంచుకున్న ‘హిందుత్వ ఎజెండా’ ఆ పార్టీకి  ఎన్నికలలో లాభాలు తెచ్చిపెడుతోంది. ముస్లిం వర్గానికి చెందిన వాళ్లు తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా మారతామనే భయంతో ఓటు వేస్తున్నారు’’ అని ఒవైసీ ఆరోపించారు. 

“ముస్లిం డోమ్స్ మాదిరి ఉన్నాయన్న కారణంతో తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నారు. తెలంగాణకు అమిత్ షా వచ్చినప్పుడల్లా.. 4 శాతం రిజర్వేషన్లు తొలగిస్తామని చెబుతున్నారు. ఇక్కడ రెండో వైపున ఎవరు మాట్లాడుతున్నారు. రెండు వైపులా సమానంగా ఉన్నప్పుడే పోలరైజేషన్ జరుగుతుంది. హిందుత్వ ఎజెండా వల్లే పోలరైజేషన్ జరుగుతోంది. అంతే తప్ప నా వల్ల కాదు’’ అని అన్నారు.

“ఇస్లాం ఎప్పటికీ ప్రమాదంలో పడబోదు. దేశం, సామాజిక నిర్మాణం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయి’’ అని అసద్ అన్నారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పక్కన పూజారులు ఉండటాన్ని, రాజదండానికి ప్రధాని సాష్టాంగ నమస్కారం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. ఆయన ఒక మతానికి చెందిన ప్రధాన మంత్రినా? అని నిలదీశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని మత పండుగలా మార్చారని, ప్రధాని ‘సూపర్ స్టార్’లా మారిపోయారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పైనా ఒవైసీ విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ముస్లింలపై దాడులు జరిగాయి. చంపేశారు కూడా. గుజరాత్ అల్లర్ల బాధితులకు కాంగ్రెస్ చేసిన సాయమేంటి? నేను కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం లేదు. నిజాలు చెబుతున్నానంతే. 100 రామ మందిరాలు కట్టిస్తామని తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ చెబుతున్నారు’’ అని మండిపడ్డారు.

More Telugu News