Traffic restrictions: హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..!

traffic restrictions in hyderabad on friday due to telangana formation day celebrations
  • రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. దశాబ్ది వేడుకలు నిర్వహించనున్న ప్రభుత్వం
  • సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించిన పోలీసులు
  • ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడి
  • ఎన్టీఆర్‌ గార్డెన్స్, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కును మూసివేయనున్నట్లు ప్రకటన
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రేపటికి పదేళ్లు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మూడు వారాల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. తొలిరోజైన శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. 

ఈ నేపథ్యంలో సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. వాహనాలను దారి మళ్లించనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ గార్డెన్స్, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కును మూసివేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా సచివాలయం, గన్‌పార్కు పరిసరాల్లో, ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఆ మార్గాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అధికారులు సూచించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద కూడా వేడుకలు జరగనున్నాయి. ఆ సమయంలో ఆ రూట్‌లో వాహనాలను కొద్దిసేపు నిలిపివేయనున్నారు.

రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వీవీ విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ వరకు ఇరువైపులా ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నుంచి షాదన్‌ కాలేజీ వైపు మళ్లిస్తారు. ఇదే సమయంలో వీవీఐపీ వాహనాలు వచ్చినప్పుడు షాదాన్‌ కాలేజీ నుంచి సోమాజిగూడ రూట్‌లో ట్రాఫిక్‌ను కొన్ని నిమిషాల పాటు ఆపుతారు.

ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలకు అనుమతి ఉండదు. ఈ వాహనాలను తెలుగు తల్లి జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వద్దకు మళ్లిస్తారు. అలాగే తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ నుంచి కట్టమైసమ్మ జంక్షన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు. ఆఫ్జల్‌గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్‌పై కాకుండా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, కట్టమైసమ్మ ఆలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కవాడిగూడ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు.

ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు. బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ రూట్‌లోకి వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు. బడా గణేశ్‌ లైన్ వైపు నుంచి ఐమాక్స్‌, నెక్లెస్‌ రోటరీ నుంచి మింట్‌ కంపౌండ్‌ వెళ్లే వాహనాలను రాజ్‌దూత్‌ లైన్ లోకి మళ్లిస్తారు. మింట్‌లైన్‌ నుంచి బడా గణేశ్‌ రూట్‌లో అనుమతించరు. ఈ వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు మళ్లిస్తారు.
Traffic restrictions
Telangana Formation Day
AP Secretariat
Hyderabad
KCR

More Telugu News