Rahul Gandhi: బహుశా అంత శిక్ష పడింది నాకొక్కడికే కావచ్చు.. రాహుల్ గాంధీ

  • ఇలాంటివి జరుగుతాయని తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అనుకోలేదన్న రాహుల్ 
  • తనపై అనర్హత వేటు కూడా మంచికే జరిగిందని వ్యాఖ్య
  • దేశాన్ని ఇప్పుడు దేవుడి కంటే ఎక్కువ తెలిసిన వారు పాలిస్తున్నారని ఎద్దేవా
First person to get maximum sentence for defamation says Rahul Gandhi

పరువునష్టం కేసులో తన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కేసులో గరిష్ఠ శిక్ష ఎదుర్కొన్నది బహుశా తానే కావచ్చని అభిప్రాయపడ్డారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించిన రాహుల్ పార్లమెంటు సభ్యుడిగా తన పరిచయంపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2004లో తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇలాంటివి సాధ్యమవుతాయని అప్పుడు అస్సలు అనుకోలేదని పేర్కొన్నారు. కానీ ఈ రోజు పరువు నష్టం కేసులో గరిష్ఠ శిక్షను ఎదుర్కొన్నట్టు చెప్పారు. అయితే, తనపై అనర్హత వేటు కూడా ఒకందుకు మంచిదేనని అభిప్రాయపడ్డారు. ‘భారత్ జోడో యాత్ర’ను ప్రస్తావిస్తూ పార్లమెంటులో కూర్చోవడం కంటే ‘పెద్ద అవకాశం’ లభించిందని అన్నారు.

భారత్‌లో ప్రతిపక్షాలు పోరాడుతున్నాయని, వ్యవస్థలను బీజేపీ స్వాధీనం చేసుకుందని విమర్శించారు. తాము ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నట్టు చెప్పారు. వ్యవస్థలేవీ సాయం చేయకపోవడాన్ని తాము చూశామని, అందుకనే తాము రోడ్లపైకి వస్తున్నామని, దాని ఫలితమే ‘భారత్ జోడో యాత్ర’ అని రాహుల్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలతో మమేకం కావాలని, వారు అడిగే కొన్ని క్లిష్ట ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రాహుల్ కోరారు. భారత్‌ను ఇప్పుడు దేవుడి కంటే తనకే ఎక్కువ తెలుసన్న వారు పాలిస్తున్నారని పరోక్షంగా మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

More Telugu News