Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో సామూహిక వివాహ కార్యక్రమంలో కండోమ్‌ల పంపిణీపై విమర్శలు

  • ముఖ్యమంత్రి కన్యా వివాహ్ పథకం కింద సామూహిక వివాహాలు
  • ప్రభుత్వం పంపిణీ చేసిన పెళ్లి కిట్‌లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు 
  • ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం, దేనికైనా సమయం, సందర్భం ఉండాలని వ్యాఖ్య
  • అవి కుటుంబ నియంత్రణ కోసం ఉద్దేశించిన బాక్స్‌ అని అధికారుల క్లారిటీ
Distribution of condoms at mass wedding event in MP stirs up controversy

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సామూహిక వివాహ కార్యక్రమంలో కండోమ్స్, గర్భనిరోధక మాత్రల పంపిణీ వివాదాస్పదంగా మారింది. ఇది సిగ్గుమాలిన చర్య అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీని తిట్టిపోస్తోంది. 

ఆర్థికంగా వెనుకబడ్డ వారి కోసం ముఖ్యమంత్రి కన్యా వివాహ్ పథకం కింద ఇటీవల జాభువా జిల్లాల్లో సామూహిక వివాహ కార్యక్రమం జరిగింది. ఇందులో 283 మంది జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివాహం అనంతరం నూతన వధూవరులకు పెళ్లి కిట్లు పంపిణీ చేశారు. వాటిల్లోని మేకప్ బాక్సుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు కనిపించడంతో వధూవరులు అవాక్కయ్యారు. ఆ బాక్సులపై నేషనల్ హెల్త్ మిషన్ స్టిక్కర్లు కూడా అంటించి ఉన్నాయి. 

ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రభుత్వాధికారులు సిగ్గుమాలిన, అమర్యాదకరమైన చర్యకు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబనియంత్రణపై అవగాహన కల్పించడం సబబేకానీ, ప్రతి పనికీ ఓ సమయం, సందర్భం వుంటాయని వ్యాఖ్యానించింది. కాగా, ఈ ఘటనపై తాండ్లా ఎస్‌డీఎమ్ తరుణ్ జైన్ స్పందించారు. అవి మేకప్ కిట్లు కాదని, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ‘నయీ పహల్’ కిట్‌లు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

More Telugu News