Suryanarayana: ఉద్యోగులను ఎత్తుకుపోయిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి: సూర్యనారాయణ

  • వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల అరెస్ట్
  • భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు
  • గవర్నర్ ను కలిసినందుకు ప్రభుత్వం తమపై కక్షగట్టిందన్న సూర్యనారాయణ
Suryanarayana reacts commercial taxes employees arrest

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల అరెస్ట్ పై ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ స్పందించారు. గవర్నర్ ను కలిసినందుకు ప్రభుత్వం తమపై కక్షగట్టిందని అన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని స్పష్టం చేశారు. 

రెండేళ్ల క్రితం వార్త ఆధారంగా ఉద్యోగులను సస్పెండ్ చేస్తారా? అని సూర్యనారాయణ ప్రశ్నించారు. ఏపీ హైకోర్టు కూడా ఉద్యోగుల సస్పెన్షన్లను కొట్టివేసిందని, ఇప్పుడు ఏ కేసులో ఉద్యోగులను అరెస్ట్ చేశారో చెప్పలేదని ఆరోపించారు. సస్పెన్షన్లకు, అరెస్టులకు ఉద్యోగులు భయపడబోరని సూర్యనారాయణ పేర్కొన్నారు. 

ఉద్యోగుల అరెస్ట్ పై రాష్ట్ర సీఎస్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అరాచకంగా ప్రవర్తించడం అన్యాయమని అన్నారు. ఉద్యోగులపై కేసులను ఏ ఏజెన్సీ విచారిస్తోందో తెలియదని వ్యాఖ్యానించారు. ఉద్యోగులను ఎత్తుకుపోయిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఉద్యోగులు కనిపించకపోవడంపై హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తామని సూర్యనారాయణ తెలిపారు. జీపీఎఫ్ డబ్బులు ఇచ్చేంతవరకు ఉద్యోగుల పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

More Telugu News