meenakshi lekhi: రెజ్లర్ల ఆందోళనపై మీడియా ప్రశ్నిస్తుంటే పరుగులు పెట్టిన కేంద్రమంత్రి.. వీడియో ఇదిగో!

  • దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఘటన
  • వైరల్ గా మారిన మంత్రి పరుగులు పెడుతున్న వీడియో
  • వీడియో ట్వీట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసిన కాంగ్రెస్ పార్టీ
central minister meenakshi lekhi viral video

బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రెజ్లర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలంటూ ప్రముఖ రెజ్లర్లు ఢిల్లీలో గత నలభై రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా తమ మెడల్స్ ను గంగలో నిమజ్జనం చేస్తామని హరిద్వార్ కు వెళ్లారు. అయితే, రైతు సంఘాల నేతల విజ్ఞప్తితో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆందోళన చేస్తున్న రెజ్లర్లలో సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా తదితరులు ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి వద్ద రెజ్లర్ల ఆందోళనను మీడియా ప్రస్తావించింది. ఆందోళన చేస్తున్న రెజ్లర్ల విషయంలో ఎలా స్పందిస్తారంటూ అడగగా.. సమాధానం చెప్పేందుకు మంత్రి నిరాకరించారు. అయినా పదే పదే అదే ప్రశ్న అడుగుతుంటే కేంద్ర మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.

మంత్రితో పాటే నడుస్తూ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తుంటే.. మంత్రి మీనాక్షి లేఖి పరుగు పెడుతూ కారు వద్దకు వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేంద్ర మంత్రి పరుగులు పెడుతున్న వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేస్తూ.. మహిళా రెజ్లర్ల ఆందోళనపై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఎంత సూటిగా బదులిచ్చారో చూడండంటూ ఎద్దేవా చేసింది.

More Telugu News