Narendra Modi: మోదీ ఆ దేవుడికీ పాఠాలు చెబుతారు: రాహుల్ గాంధీ

  • ఈ విశ్వం ఎలా పని చేస్తుందో భగవంతుడికే వివరించగలరని ఎద్దేవా
  • తమకే అన్నీ తెలుసన్న ఓ సమూహం దేశాన్ని పాలిస్తోందని విమర్శ
  • అమెరికా పర్యటనలో ప్రవాసులతో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత
PM Modi will start explaining God how universe works setires Rahul Gandhi in US

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అమెరికాలోని మూడు నగరాల పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ ప్రవాసులతో సంభాషించారు. బుధవారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కార్యకర్తలు, విద్యావేత్తలు, పౌర సమాజంతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ.. దేవుడికే పాఠాలు చెప్పగలరని ఎద్దేవా చేశారు. తమకు అన్నీ తెలుసన్న అతి విశ్వాసంతో ఉన్న వ్యక్తుల సమూహం భారతదేశాన్ని పాలిస్తోందని బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఇదే విషయాన్ని వాళ్లు దేవుడితో కూడా చెప్పగలరని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే కోవకు చెందుతారని విమర్శించారు.

‘మీరు మోదీని దేవుని పక్కన కూర్చోబెడితే, ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో ఆయన దేవునికే వివరించడం ప్రారంభిస్తారు. ఆ దెబ్బకు తాను సృష్టించిన ప్రపంచం గురించి దేవుడే గందరగోళానికి గురవుతాడు’ అని మోదీని ఎద్దేవా చేశారు. ‘భారత్‌ లో అంతా తమకే తెలుసనే ఓ గ్రూపు ఉంది. వాళ్లు శాస్త్రజ్ఞులకు విజ్ఞాన శాస్త్రాన్ని, చరిత్రకారులకు చరిత్రను, సైన్యానికి యుద్ధాన్ని వివరించగలరు. నిజం చెప్పాలంటే, అలాంటి వారికి అసలు ఏమీ తెలియదు, ఏదీ అర్థం కాదు’ అని విమర్శించారు. 

భారత్ జోడో యాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో రాహుల్ వివరించారు. ‘కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అందుకే మేము భారత్ జోడో యాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. యాత్రను ఆపేందుకు ప్రభుత్వం చేయగలిగినదంతా చేసింది. కానీ, యాత్ర ప్రభావం పెరుగుతూ పోయింది’ అని రాహుల్ వివరించారు.

More Telugu News