Ravindra Jadeja: గుజరాత్ గెలుపుకోసం పోరాడిన చెన్నై బ్యాటర్.. చెన్నైని గెలిపించిన గుజరాత్ బ్యాటర్

  • చివరి బంతిని బౌండరీకి పంపి విజయం షురూ చేసిన రవీంద్ర జడేజా
  • జడేజా గుజరాత్ రాష్ట్ర వాసి.. గుజరాత్  ఓటమిని శాసించిన చెన్నై జట్టు సభ్యుడు
  • గుజరాత్ టైటాన్స్ జట్టులో అత్యధిక స్కోరర్ సాయి సుదర్శన్ తమిళనాడు వాసి
Gujarat hero Ravindra Jadeja breaks GT hearts after Chennai boy Sai Sudharsan shines vs CSK

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ తుది మ్యాచ్ కు సంబంధించి ఓ అద్భుతమైన విశేషాన్ని చెప్పుకుని తీరాల్సిందే. ఫైనల్ పోరు కోసం బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీల విజయానికి ఓ ఇద్దరు తమ శక్తివంచన లేకుండా కృషి చేశారు. వారే సాయి సుదర్శన్. రవీంద్ర జడేజా. వీరిద్దరికీ ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే సాయి సుదర్శన్ తమిళనాడు రాష్ట్ర వాసి. కానీ, గుజరాత్ జట్టులో సభ్యుడు. రవీంద్ర జడేజా గుజరాత్ వాసి. కానీ చెన్నై జట్టులో సభ్యుడు. 

సాయి సుదర్శన్ ఈ ఐపీఎల్ సీజన్ లో గొప్పగా రాణించింది ఫైనల్ మ్యాచులోనే. 47 బంతులను ఎదుర్కొని 96 పరుగులు పిండుకున్నాడు. గుజరాత్ 214 కొట్టిందంటే సాయి సుదర్శన్ డాషింగ్ పనితీరు వల్లేనని చెప్పుకోవాలి. అయినా, గుజరాత్ ను విజయం వరించలేదు. సాయి సుదర్శన్ అంత కాకపోయినా రవీంద్ర జడేజా కేవలం 6 బంతుల్లో 15 పరుగులు పిండుకుని చెన్నైకి విజయాన్నందించాడు. తన జట్టు కోసం, సారథి మహేంద్ర సింగ్ ధోనీ కోసం జడేజా శక్తివంచన లేకుండా కృషి చేశాడు. చిరస్మరణీయ విజయానికి కారకుడయ్యాడు. కానీ, గుజరాత్ అభిమానుల హృదయాలను గాయపరిచాడు. ఒకవేళ చెన్నై బదులు గుజరాత్ విజయం సాధించినా, అది సాయి సుదర్శన్ బ్యాటింగ్ ప్రదర్శన వల్లేనని చెప్పుకోవాల్సి వచ్చేది. విధి వింత నాటకం అంటే ఇదేనేమో..?

చెన్నై అభిమానుల పట్ల రవీంద్ర జడేజా ఇటీవలి కాలంలో కొంత అసహనంగా ఉన్నాడు. తాను క్రీజులోకి ధోనీ కంటే ముందుగా వచ్చిన సందర్భాల్లో అభిమానులు ధోనీ, ధోనీ, ధోనీ అని నినదించడం పట్ల జడేజా ఓ సారి స్పందిస్తూ.. తాను త్వరగా అవుట్ అవ్వాలని వారు కోరుకుంటున్నట్టుందన్నాడు. అప్ స్టాక్స్ కు తెలుసు. కానీ, కొందరు అభిమానులకే తన విలువ తెలియడం లేదంటూ ఇటీవలే ఓ ట్వీట్ కూడా వదిలాడు. అయినా కానీ, ఫైనల్ మ్యాచులో ధోనీ ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుట్ కాగా, తర్వాత జడేజాయే క్రీజులోకి వచ్చి చెన్నైకి విజయాన్నందించాడు. దీంతో అయినా అటు ఫ్యాన్స్, ఇటు జడేజా మధ్య అంతరం తొలగిపోతుందేమో చూడాలి.

More Telugu News