wrestlers: పతకాలు గంగలో వేస్తామని చెప్పి.. టికాయత్‌ చేతిలో వేశారు: బ్రిజ్ భూషణ్

  • కేంద్రం తీరుకు వ్యతిరేకంగా గంగా నది వద్ద ఆందోళనకు దిగిన రెజ్లర్లు
  • న్యాయం చేయకుంటే పతకాలను నదిలో వేస్తామన్న మల్లయోధులు
  • రైతు నేతలు నచ్చజెప్పడంతో  ఆలోచన విరమించుకున్న క్రీడాకారులు
 They went to immerse medals but gave it to Tikait WFI chief slams protesting wrestlers

భారత రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ మల్లయోధులపై మరోసారి ఎదురుదాడి చేశారు. తమ పతకాలను గంగా నదిలో పడేస్తామని వెళ్లిన రెజ్లర్లు వాటిని రైతు నాయకుడు టికాయత్ చేతిలో పెట్టారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెజ్లర్లు తమ పతకాలను గంగలో నిమజ్జనం చేసేందుకు నిన్న సాయంత్రం హరిద్వార్ చేరుకున్నారు. సమస్య పరిష్కారానికి ఐదు రోజుల సమయం కావాలని రైతు నాయకులు కోరడంతో తమ ఆలోచనను విరమించుకున్నారు. 

దీనిపై డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ స్పందిస్తూ.. ‘ఆటగాళ్లు తమ పతకాలను నదిలో పడేస్తామంటే మనం ఏం చేయగలం?’ అని ప్రశ్నించారు. ఓ ఆంగ్ల టీవీతో ఆయన మాట్లాడుతూ, ‘రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో ముంచడానికి వెళ్లారు. కానీ గంగా నీళ్లకు బదులుగా, వారు తమ పతకాన్ని రాకేష్ టికాయత్‌కు ఇచ్చారు. అది వారి వైఖరి. దానికి మనం ఏమి చేయగలం?’ అని అన్నారు. 

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్‌తో సహా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. బ్రిజ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్‌ లో తన పదవీకాలం ముగిసిందన్న బ్రిజ్‌.. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఇక తన చేతుల్లో ఏమీ లేదన్నారు. తప్పు చేసినట్లు తేలితే తనను అరెస్టు చేస్తారని, అందుకు సిద్ధంగా ఉన్నానని  స్పష్టం చేశారు.

More Telugu News