Telangana: రిటైరయ్యాక ఇంటర్‌‌లో చేరి.. 74 ఏళ్ల వయసులో ఉత్తీర్ణత

Retired army man completes Inter at the age of 74
  • హైదరాబాద్‌కు చెందిన కల్లా నాగ్‌శెట్టి అరుదైన ఘనత
  • చిన్నప్పుడు ఆర్థిక సమస్యలతో మెట్రిక్యులేషన్‌తోనే విద్యకు స్వస్తి  
  • ఆర్మీ, ప్రైవేటు ఉద్యోగాల్లో 42 ఏళ్లు పని చేసి రిటైర్మెంట్‌
సాధారణంగా ఇంటర్‌‌ విద్యార్థుల వయసు 17–18 ఏళ్లు ఉంటుంది. ఒకటి రెండుసార్లు ఫెయిలైనా రెండేళ్ల కోర్సును 19–20 ఏళ్లలోపే పూర్తి చేస్తుంటారు. కానీ, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 74 ఏళ్ల వయసులో ఇంటర్‌‌ పూర్తి చేశారు. రిటైరైన తర్వాత ఇంటర్‌‌ లో చేరి పాస్‌ అయి శభాష్ అనిపించుకున్నారు. ఆయన పేరు కల్లా నాగ్‌శెట్టి. హైదరాబాద్‌లో ఉప్పుగూడ శివాజీనగర్‌ నివాసి అయిన అతను బీదర్‌ జిల్లాలో 1949లో జన్మించి ఎస్‌ఎస్‌ఎల్‌సీ (మెట్రిక్యులేషన్‌) వరకు అక్కడే చదివారు. అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పై చదువులకు వెళ్లలేక ఆర్మీలో సిపాయిగా ఉద్యోగంలో చేరారు.

21 ఏళ్లు ఆర్మీలో పని చేసిన ఆయన, మరో 21 ఏళ్లు పలు ప్రైవేటు కంపెనీల్లో పని చేశారు. పూర్తిగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత చిన్నప్పుడు ఆపేసిన చదువును మళ్లీ కొనసాగించేందుకు తెలంగాణ ఇంటర్‌బోర్డు నుంచి అనుమతి తెచ్చుకొన్నారు. సైదాబాద్‌లోని గోకుల్‌ జూనియర్‌ కాలేజీలో సీఈసీలో చేరిన ఆయన ఈ ఏడాది మార్చిలో వార్షిక పరీక్షలు రాశారు. ఏకంగా 77.04 శాతంతో ఉత్తీర్ణత సాధించిన ఆయన ఇప్పుడు డిగ్రీ చదివేందుకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. చదువుకు వయసు అడ్డుకాదనేందుకు నాగ్‌ శెట్టి మంచి ఉదాహరణగా నిలిచారు.
Telangana
retired
army
inter

More Telugu News