Daniil Medvedev: ఫ్రెంచ్ ఓపెన్ లో పెను సంచలనం... వరల్డ్ నెంబర్ 2 మెద్వెదెవ్ అవుట్

  • తొలి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టిన మెద్వెదెవ్
  • బ్రెజిల్ ఆటగాడు తియాగో సేబూత్ వైల్డ్ చేతిలో ఓటమి
  • 4 గంటల 15 నిమిషాల పాటు సాగిన మ్యాచ్
  • ఐదు సెట్ల సమరంలో నెగ్గిన బ్రెజిల్ యువ కెరటం
World number 2 Daniil Medvedev out of French Open

పారిస్ లోని రోలాండ్ గారోస్ స్టేడియంలో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మూడో రోజున పెను సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్ 2 ఆటగాడు, రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ తొలి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టాడు. ఇవాళ జరిగిన మ్యాచ్ లో 23 ఏళ్ల బ్రెజిల్ యువకెరటం తియాగో సేబూత్ వైల్డ్ ఐదు సెట్ల సమరంలో మెద్వెదెవ్ ను చిత్తు చేశాడు. తియాగో 7-6, 6-7, 2-6, 6-3, 6-4తో మెద్వెదెవ్ ను ఓడించాడు. 

మెద్వెదెవ్ కు ఇది దిగ్భ్రాంతికర ఫలితం అని చెప్పాలి. ఈ ఏడాది ఏటీపీ టూర్ లో ఐదు టైటిళ్లు నెగ్గి, 39 విజయాలతో మాంచి ఊపుమీదున్న మెద్వెదెవ్ ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్ లోనే ఓడిపోతాడని ఎవరూ ఊహించలేదు. అయితే, అతడి ప్రత్యర్థి తియాగో సేబూత్ వైల్డ్ తక్కువ వాడేమీ కాదు. క్లేకోర్టులపై ఆడడంలో దిట్ట. అతడు ఇప్పటివరకు సాధించిన నాలుగు టైటిళ్లు క్లేకోర్టులపై గెలిచినవే. 

ఫ్రెంచ్ ఓపెన్ లో టాప్-2 ఆటగాడు తొలి రౌండ్ లోనే ఓడించడం 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2000 సంవత్సరంలో ఆసీస్ ఆటగాడు మార్క్ ఫిలిప్పోసిస్ అమెరికా దిగ్గజం పీట్ సంప్రాస్ ను ఓడించాక... మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఘనత తియాగో సేబూత్ వైల్డ్ దక్కించుకున్నాడు. నేటి మ్యాచ్ 4 గంటల 15 నిమిషాల సుదీర్ఘ సమయం పాటు జరిగింది.

More Telugu News