Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణ జూన్ 1కి వాయిదా

Delhi Liquor Scam case hearing adjourned to June 1
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ అంశాలు
  • దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 
  • మే 4న నాలుగో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ
  • దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన నాలుగో అనుబంధ చార్జిషీటును రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మే 4వ తేదీన లిక్కర్ స్కాం మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ నాలుగో అనుబంధ చార్జిషీటును దాఖలు చేసింది. ఈ అనుబంధ చార్జిషీటులో ప్రధానంగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై అభియోగాలు మోపింది. 

లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఈ చార్జిషీటులో పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. కవిత విషయంలో గత చార్జిషీటులో పొందుపరిచిన అంశాలనే ఈడీ మరోమారు ప్రస్తావించింది. దక్షిణాది వ్యక్తులకు, ఆప్ నేతలకు మధ్య ఒప్పందం ఉందని అభియోగాలు మోపింది. 

ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో దక్షిణాది వ్యక్తులకు లబ్ది చేకూర్చేలా పాలసీ రూపకల్పనలో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదు చేసింది. లబ్ది చేకూర్చినందుకు దక్షిణాది వ్యక్తుల నుంచి ఆప్ నేతలకు ముడుపులు అందాయని ఈడీ ఆరోపించింది. ఈ మేరకు 270 ముఖ్యమైన డాక్యుమెంట్లు, 2 వేల పేజీలతో కూడిన 4వ అదనపు చార్జిషీటును ఈడీ మే మొదటివారంలో దాఖలు చేసింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ గతంలో మూడుసార్లు ప్రశ్నించింది. తాము ఇప్పటివరకు ప్రశ్నించిన 51 మంది వివరాలను కూడా ఈడీ చార్జిషీటులో పొందుపరిచింది. అయితే, ఈడీ పేర్కొన్న 51 మందిలో కవిత పేరు లేనట్టు తెలుస్తోంది. ఆ మేరకు నాలుగో చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది.
Delhi Liquor Scam
ED
Charge Sheet
Court

More Telugu News