TSPSC: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రానికి చాట్ జీపీటీ సాయంతో జవాబులు సేకరించిన నిందితుడు!

  • తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రశ్నాపత్రాల లీక్
  • రమేశ్ అనే డివిజనల్ ఇంజినీర్ ను అరెస్ట్ చేసిన సిట్
  • రమేశ్ కు ప్రశ్నాపత్రాలు ఫోన్ లో పంపిన ప్రిన్సిపాల్
  • చాట్ జీపీటీ సాయంతో సేకరించిన జవాబులను బ్లూటూత్ ద్వారా పంపిన రమేశ్
  • ఒక్కో అభ్యర్థి నుంచి రూ.40 లక్షలు వసూలు!
Accused used ChatGPT to answer TSPSC question papers

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. నిందితుల్లో ఒకరు టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు జవాబుల కోసం చాట్ జీపీటీని వినియోగించినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. 

పెద్దపల్లిలోని తెలంగాణ స్టేట్ నార్త్ డిస్కంలో డివిజనల్ ఇంజినీర్ గా పనిచేస్తున్న పూల రమేశ్ (35) టీఎస్ పీఎస్సీ నిర్వహిస్తున్న ఏఈఈ, డీఏఓ ప్రశ్నాపత్రాలను చేజిక్కించుకున్నాడు. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న చాట్ జీపీటీ సాయంతో ఆ క్వశ్చన్ పేపర్లలోని ప్రశ్నలకు జవాబులు సేకరించాడు. పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లిన అభ్యర్థులకు ఆ జవాబులను బ్లూటూత్ ఇయర్ బడ్స్ ద్వారా ప్రసారం చేశాడు. 

ఓ పరీక్ష కేంద్రం వద్ద విధుల్లో ఉన్న ప్రిన్సిపాల్ ఒకరు ఆ రెండు ప్రశ్నాపత్రాలను ఫోటోలు తీసి వాటిని రమేశ్ కు పంపినట్టు గుర్తించారు. వేరొక ప్రాంతంలో తన నలుగురు సహాయకులతో సిద్ధంగా ఉన్న రమేశ్... అప్పటికప్పుడు చాట్ జీపీటీ సాయంతో వాటికి సమాధానాలు సిద్ధం చేసి, వాటిని పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు పంపించాడు. టీఎస్ పీఎస్సీ పరీక్షలతో తాము పాస్ అయ్యేట్టు చేస్తే ఒక్కొక్కరు రూ.40 లక్షలు ఇచ్చేట్టు రమేశ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడైంది. 

అయితే, మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పరీక్షలో రమేశ్ చాట్ జీపీటీ ఉపయోగించలేదని తెలిసింది. తన బంధువు ద్వారా సేకరించిన ప్రశ్నాపత్రాన్ని 30 మంది అభ్యర్థులకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల చొప్పున విక్రయించినట్టు గుర్తించారు. రమేశ్ ను సిట్ గత మార్చిలోనే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News