Jagan: సీఎంగా నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న జగన్.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సేవా కార్యక్రమాలు

  • గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలను గెలుపొందిన జగన్
  • 50 శాతానికి పైగా ఓట్లను సాధించిన వైసీపీ
  • తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన సజ్జల
Jagan completed 4 years as CM

వైసీపీ అధినేత జగన్ నేటితో ముఖ్యమంత్రిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలను చేపడుతున్నాయి. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సంబరాలు అంబరాలను తాకే విధంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రధాన కార్యాలయంలో కేక్ కట్ చేశారు. వైసీపీ జెండాను ఎగురవేశారు. 

2019 ఏప్రిల్ లో సాధారణ ఎన్నికలు జరగ్గా, మే 23న ఫలితాలు వెలువడ్డాయి. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను వైసీపీ 151 స్థానాల్లో గెలుపొంది, తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇదే సమయంలో 25 లోక్ సభ స్థానాలకు గాను 22 స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లను వైసీపీ సాధించింది. 

ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 98.4 శాతం పూర్తి చేశామని వైసీపీ నేతలు చెపుతున్నారు. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా దాదాపు 2.10 లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసినట్టు ప్రభుత్వం చెపుతోంది. ఇదే అంశాన్ని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రధాన అస్త్రంగా వినియోగించుకోనుంది.

More Telugu News