Stalin: రెజ్లర్లకు మద్దతు పలికిన స్టాలిన్... చిన్మయి-వైరముత్తు వివాదంతో కౌంటర్ ఇచ్చిన బీజేపీ

  • దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్ల ఆందోళనలు
  • రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు
  • తొలిరోజే సెంగోల్ వంగిపోయిందంటూ కేంద్రంపై స్టాలిన్ వ్యంగ్యం
  • నాడు వైరముత్తుపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్న అన్నామలై
Tamilnadu BJP chief Annamalai counter CM Stalin with Chinmayi and Vairamuthu issu

రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న రెజ్లర్లకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మద్దతు పలకడం తెలిసిందే. నిన్న నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం జరగ్గా, రెజర్ల పార్లమెంటు ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. 

దీన్ని దృష్టిలో ఉంచుకుని, పార్లమెంటు ప్రారంభమైన తొలిరోజే సెంగోల్ (రాజదండం) వంగిపోయింది అంటూ స్టాలిన్ కేంద్రానికి చురక అంటించారు. అయితే, స్టాలిన్ వ్యాఖ్యల పట్ల తమిళనాడు బీజేపీ భగ్గుమంది. 

గతంలో సినీగాయని చిన్మయి శ్రీపాద తనపై గీతరచయిత వైరముత్తు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆక్రోశిస్తే, స్టాలిన్ ఎక్కడికి పోయారని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మండిపడ్డారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై కనీసం ఎఫ్ఐఆర్ అయినా నమోదైందని, కానీ, నాడు వైరముత్తు విషయంలో ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించారు. బ్రిజ్ భూషణ్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని, మరి వైరముత్తు విషయంలో చట్టాన్ని ఎందుకు అమలు చేయడంలేదని అన్నామలై నిలదీశారు. 

కోలీవుడ్ సీనియర్ లిరిక్ రైటర్, తమిళ కవి వైరముత్తు సీఎం స్టాలిన్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఆయనపై 19 లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తీవ్ర పోరాటం చేశారు. కానీ, తమిళ చిత్ర పరిశ్రమ వైరముత్తుకు మద్దతు పలుకుతూ, చిన్నయిపైనే నిషేధం విధించడం గమనార్హం.

More Telugu News