Virender Sehwag: కెప్టెన్‌ గా లేకుంటే.. ధోనీ ఆడడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ తో ధోనీ ఆటను కొనసాగిస్తాడన్న డ్వేన్ బ్రేవో
  • ఆ నిబంధన ధోనీకి వర్తించదన్న వీరేందర్ సెహ్వాగ్
  • కెప్టెన్ గా అతడు గ్రౌండ్ లో ఉండాల్సిందేనని వ్యాఖ్య
  • కెప్టెన్‌ కాకపోతే.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా కూడా ఆడడని వెల్లడి
  • భవిష్యత్తులో ధోనీని కోచ్‌ లేదా డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ పదవిలో చూడొచ్చని జోస్యం
Virender Sehwag comments on MS Dhoni Future

ఐపీఎల్ లో కొత్తగా ‘ఇంపాక్ట్‌’ ప్లేయర్‌ రూల్‌ ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిబంధన వల్ల అదనంగా బౌలర్‌/బ్యాటర్‌ను తీసుకొనే వెసులుబాటు జట్లకు లభించింది. ఈ సీజన్ లో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ, బెంగళూరు సారథి డుప్లెసిస్ కూడా ఇలాగే ‘ఇంపాక్ట్‌’ ప్లేయర్ గా ఆడారు. ధోనీకి ఇదే చివరి సీజన్‌గా భావిస్తున్న సమయంలో ‘ఇంపాక్ట్’ రూల్‌తో అతడు మరికొన్ని ఏళ్లు ఆడతాడని చెన్నై సూపర్ కింగ్స్‌ కోచ్‌ డ్వేన్ బ్రావో అభిప్రాయపడ్డాడు. కానీ టీమిండియా మాజీ ఆటగాడు వీరేందర్ సెహ్వాగ్ మాత్రం ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. ధోనీకి ఇలాంటి ఇంపాక్ట్ రూల్ వర్తించదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ఫిట్ గా ఉంటే.. 40 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం పెద్ద కష్టమేం కాదు. ఈ సీజన్ లో ధోనీ పెద్దగా ఆడటం లేదు. తన మోకాలి గాయం తీవ్రం కాకుండా ధోనీ చూసుకుంటున్నాడు. అందుకే చివరి రెండు ఓవర్లలో వస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటిదాకా ఆడిన బంతులను లెక్కపడితే.. 40 నుంచి 50 దాకా ఉంటాయంతే’’ అని సెహ్వాగ్ వివరించాడు.

‘‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ధోనీకి వర్తించదు. ఎందుకంటే ఇప్పుడు అతడు కెప్టెన్సీ కోసమే ఆడుతున్నాడు. మైదానంలో వ్యూహాలను రచిస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. అంటే.. కెప్టెన్ గా అతడు గ్రౌండ్ లో ఉండాల్సిందే. అందుకే ధోనీకి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ అవసరం లేదు. వర్తించదు కూడా’’ అని వివరించాడు. 

‘‘ఇంప్టాక్‌ రూల్‌ అనేది పూర్తిస్థాయిలో మైదానంలో లేకుండా బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ చేయడానికే వినియోగించుకుంటారు. కానీ ధోనీ మాత్రం 20 ఓవర్లపాటు మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తాడు. అతడు కెప్టెన్‌ కాకపోతే.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా కూడా ఆడడు. అందుకే భవిష్యత్తులో ధోనీని కోచ్‌ లేదా డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ పదవిలో చూసే అవకాశం లేకపోలేదు’’ అని సెహ్వాగ్‌ వివరించాడు. 

గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత ధోనీ తన ఐపీఎల్ రిటైర్‌మెంట్‌ను ప్రకటిస్తాడనే ఊహాగానాలు పెద్దఎత్తున వస్తున్నాయి. కానీ సీఎస్‌కే కోచ్‌ డ్వేన్ బ్రావో మాత్రం వాటన్నింటినీ కొట్టిపడేశాడు. వచ్చే సీజన్‌లో ధోనీ ఆడతాడని చెప్పాడు. ‘‘వందశాతం ఆడతాడు.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌తో ఆడతాడు. తన కెరీర్‌ను మరికొంతకాలం పొడిగిస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు. మరి కెప్టెన్‌ కూల్ ధోనీ మనసులో ఏముందో?

More Telugu News