Bone strength: ఎముకలు బలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి!

  • పెద్దవుతున్న కొద్దీ ఎముకల బలం తగ్గుదల
  • కొన్ని మార్పులతో దీన్ని అడ్డుకోవచ్చు
  • క్యాల్షియం, విటమిన్ డీ తగినంత లభించేలా చూసుకోవాలి
Bone strength 6 essential tips for maintaining strong bones as you age

వయసు మీద పడుతున్న కొద్దీ ఎముకలు సహజంగా బలహీనపడుతుంటాయి. దీంతో ఫ్రాక్చర్లు, ఆస్టియో పోరోసిస్, ఇతర సమస్యల బారిన పడే రిస్క్ పెరుగుతుంది. కానీ, వయసు పెరుగుతున్నా, వృద్ధాప్యంలోకి అడుగు పెట్టినా ఎముకలు దృఢంగా ఉండాలంటే అందుకు కొన్ని చర్యలు తీసుకోవాలి.

క్యాల్షియం
ఎముకలకు తగినంత క్యాల్షియం అందేలా చూసుకోవాలి. ఇందుకోసం క్యాల్షియం తగినంత ఉండే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పాలు, పెరుగు, చీజ్, క్యాబేజీ, బ్రొక్కోలీ, నట్స్, సీడ్స్ తీసుకోవాలి. 50 ఏళ్లు దాటిన వారు రోజు మొత్తం మీద 1000 నుంచి 2000 మిల్లీ గ్రాముల క్యాల్షియం అందేలా చూసుకోవాలి. అది సాధ్యం కాకపోతే వైద్యుల సూచనతో క్యాల్షియం సప్లిమెంట్ తీసుకోవచ్చు.

విటమిన్ డీ
క్యాల్షియం మన ఎముకలకు సరిగ్గా పట్టాలంటే అందుకు విటమిన్ డీ లోటు ఉండకూడదు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యరశ్మి పడేలా చూసుకుంటే మన శరీరంలో విటమిన్ డీ తయారవుతుంది. చేపలు, గుడ్డు పచ్చసొన, డైరీ ఉత్పత్తుల్లోనూ విటమిన్ డీ ఉంటుంది. 

వ్యాయామాలు
రోజువారీగా శారీరక వ్యాయామాలు చేయాల్సి  ఉంటుంది. అప్పుడే ఎముకలు బలంగా ఉంటాయి. నడక, జాగింగ్, డ్యాన్స్, బరువులు ఎత్తడం వంటి వన్నీ ఎముకల సామర్థ్యాన్ని పెంచుతాయి. రన్నింగ్, బ్రిస్క్ వాక్ కూడా చేసుకోవచ్చు.

వీటికి దూరం
పొగతాగే అలవాటు, మద్యపాన సేవనం కూడా ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పొగతాగడం ఎముకల సాంద్రతను తగ్గిస్తుంది. మన శరీరం క్యాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని మద్యపానం దెబ్బతీస్తుంది. 

పరీక్షలు
ఎముకల సాంద్రత ఏ మేరకు ఉందో చెప్పే బోన్ డెన్సిటీ టెస్టింగ్ చేయించుకోవాల్సి రావచ్చు. ఎక్స్ రే, స్కాన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా నష్టం జరగకముందే నివారణ చర్యలు తీసుకోవచ్చు.

More Telugu News