wrestlers: అల్లర్లు సృష్టించారంటూ రెజ్లర్లపై ఎఫ్​ఐఆర్​ నమోదు

Delhi Police registers FIR against protesting wrestlers presses charges for rioting
  • బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలంటూ నెల రోజులుగా రెజ్లర్ల ఆందోళన
  • నిన్న కొత్త పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టేందుకు ప్రయత్నం
  • అడ్డుకొని అరెస్ట్ చేసిన డిల్లీ పోలీసులు
నూతన పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టేందుకు ప్రయత్నించి అరెస్టయిన భారత స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజ్రంగ్ పునియాతో పాటు రెజ్లర్ల నిరసన నిర్వాహకులపై ఢిల్లీ పోలీసులు పలు ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అల్లర్లకు పాల్పడటం, చట్టవిరుద్ధంగా సమావేశం కావడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఉత్తర్వులను పాటించకపోవడం వంటి అభియోగాలతో సెక్షన్లు 147, 149, 186, 188, 332, 353 కింద కేసు నమోదు చేశారు. కొంతమంది మల్లయోధులు రాత్రి జంతర్ మంతర్ వద్దకు వచ్చి నిరసన తెలిపారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారికి అనుమతి నిరాకరించి, వెనక్కి పంపించామన్నారు. 

మరోపక్క, తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై వినేష్ ఫోగట్ తీవ్రంగా స్పందించింది. ‘లైంగిక వేధింపులకు పాల్పడ్డ బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ఢిల్లీ పోలీసులకు ఏడు రోజులు పట్టింది. అదే శాంతియుతంగా నిరసన చేపట్టినందుకు మాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ఏడు గంటలు కూడా పట్టలేదు. దేశం నియంతృత్వంలోకి వెళ్లిపోయిందా? ఈ ప్రభుత్వం మా ఆటగాళ్ల పట్ల ఎలా వ్యవహరిస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోంది. కొత్త చరిత్ర లిఖితం అవుతోంది’ అని వినేష్ ఫోగట్  ట్వీట్ చేసింది. 

శాంతియుత నిరసన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని బజ్ రంగ్ పునియా చెప్పాడు. ‘పోలీసులు నన్ను కస్టడీలో ఉంచారు. వాళ్లు ఏమీ చెప్పడం లేదు. నేనేమైనా నేరం చేశానా? జైల్లో ఉండాల్సింది బ్రిజ్ భూషణ్. మమ్మల్ని ఎందుకు జైల్లో ఉంచారు?’ అని పునియా ప్రశ్నించాడు.
wrestlers
New Delhi
police
FIR
rioting

More Telugu News