Ambati Rayudu: ఇదే నా చివరి మ్యాచ్... రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు

  • ఇవాళ ఐపీఎల్ ఫైనల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ
  • ఈ మ్యాచ్ తో ఐపీఎల్ కు స్వస్తి చెబుతున్నట్టు రాయుడు ప్రకటన
  • ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన రాయుడు
  • 13 ఏళ్ల కెరీర్ కు ఐపీఎల్ తాజా ఫైనల్ తో ముగింపు
  • ఈసారి యూ టర్న్ తీసుకోబోనని రాయుడు స్పష్టీకరణ
Ambati Rayudu announces retirement from IPL

తెలుగుతేజం అంబటి రాయుడు ఐపీఎల్ కు రిటైర్మెంటు ప్రకటించాడు. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ తనకు చివరి మ్యాచ్ అని రాయుడు ఓ ప్రకటనలో వెల్లడించాడు. రాయుడు ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

ముంబయి ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన రాయుడు... ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కు గత కొన్ని సీజన్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాయుడు బ్యాటింగ్ పవర్ ఎలాంటిదో అతడు ధోనీ సేనలో చేరిన తర్వాతే అందరికీ తెలిసింది. రాయుడు 13 ఏళ్ల ఐపీఎల్ కెరీర్ కు తాజా సీజన్ ఫైనల్ మ్యాచ్ తో తెరపడనుంది. 

"ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి రెండు గొప్ప జట్లకు ఆడాను. మొత్తం 204 మ్యాచ్ లు, 14 సీజన్లు, 11 ప్లే ఆఫ్ లు, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు నా కెరీర్ లో ఉన్నాయి. బహుశా ఈ రాత్రికి 6వ టైటిల్ కూడా వచ్చి చేరుతుందేమో! నిజంగా ఈ ప్రస్థానం ఎంతో సాఫీగా సాగింది. ఇక, ఇవాళ్టి ఫైనల్ మ్యాచే నా కెరీర్ లో చివరి ఐపీఎల్ మ్యాచ్ అని నిర్ణయించుకున్నాను. ఈ గొప్ప టోర్నమెంట్ ను ఎంతగానో ఆస్వాదించాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు... నో యూ టర్న్!" అంటూ రాయుడు తన ప్రకటనలో పేర్కొన్నాడు. 

రాయుడు గతంలో ఓసారి రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఉద్దేశంతోనే నో యూ టర్న్ అని పేర్కొన్నట్టు తెలుస్తోంది.

More Telugu News