Lakshmi Parvathi: ఎన్టీఆర్ కు నిజమైన వారసుడు అతనొక్కడే: లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi attends NTR Centenary Celebrations in Vijayawada
  • విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
  • హాజరైన లక్ష్మీపార్వతి, కొడాలి నాని, పేర్ని నాని, వర్మ, పోసాని
  • కడుపున పుట్టినవాళ్లే వారసులు కారన్న లక్ష్మీపార్వతి
  • చివరి క్షణాల్లో అండగా నిలిచినవారే వారసులని వెల్లడి 
విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైసీపీ నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కూడా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ కు తామే వారసులమంటూ చాలామంది డబ్బాలు కొట్టుకుంటున్నారని, కడుపున పుట్టినవాళ్లే వారసులు కారని, కడవరకు అండగా నిలిచిన వారే వారసులు అని స్పష్టం చేశారు. చంద్రబాబు వెన్నుపోటుతో ఎన్టీఆర్ ఎంతో వేదనకు గురయ్యారని, మాట్లాడడం రాని లోకేశ్ కూడా తానే ఎన్టీఆర్ కు వారసుడ్నంటున్నాడని విమర్శించారు. వీళ్లు ఎన్టీఆర్ ను మోసం చేసిన దుర్మార్గులు అని మండిపడ్డారు.

ఎన్టీఆర్ చివరి నిమిషం వరకు అండగా ఉంది దేవినేని నెహ్రూ ఒక్కడేనని, దేవినేని నెహ్రూ ఒక్కడే ఎన్టీఆర్ కు నిజమైన వారసుడు అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఇవాళ విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. 

ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయంపై తీవ్రంగా పోరాడి అలసిపోయానని, తన ఆవేదనను పట్టించుకున్నవారే లేరని ఆమె వాపోయారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, సినీ ప్రముఖులు రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి తదితరులు హాజరయ్యారు.
Lakshmi Parvathi
NTR Centenary Celebrations
Vijayawada
YSRCP
Andhra Pradesh

More Telugu News