Maharashtra: తెగించిన ఇసుక మాఫియా.. కలెక్టర్ కారును తొక్కించే యత్నం!

Sand mafia tries to run over Maharashtra district collectors car
  • మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘటన
  • ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని చూసిన కలెక్టర్
  • అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కారును ఢీకొట్టే ప్రయత్నం చేసిన డంపర్ డ్రైవర్
  • నడిరోడ్డుపైనే ఇసుకను అన్‌లోడ్ చేసిన ట్రక్కు డ్రైవర్
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఇసుక మాఫియా బరితెగించింది. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రక్కు డ్రైవర్ కలెక్టర్ కారునే తొక్కించే ప్రయత్నం చేశాడు. జిల్లాలోని గెవ్రాయ్ తాలూకాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేజ్ చేస్తున్న కలెక్టర్ కారును అడ్డుకునేందుకు డంపర్ డ్రైవర్ రోడ్డుపైనే ఇసుకను అన్‌లోడ్ చేశాడు. దీంతో కలెక్టర్ దీపా ముధోల్ ముండే కారు అందులో చిక్కుకుపోయింది.

కలెక్టర్ దీపా ముధోల్ అధికారిక వాహనంలో బాడీగార్డ్‌తో కలిసి ఔరంగాబాద్ నుంచి బీడ్‌కు వెళ్తుండగా గెవ్రాయ్ తాలూకాలోని మదల్‌మోహి గ్రామంలో తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్న డంపర్ ఆమె కంటపడింది. ఆ ట్రక్కుకు నంబరు ప్లేటు కూడా లేదని పోలీసులు తెలిపారు. డంపర్‌ను ఆపాలని కలెక్టర్ తన డ్రైవర్‌కు చెప్పారు. దీంతో కారు దిగిన డ్రైవర్ డంపర్‌ను ఆపాలని చెయ్యి చూపించారు. అయినప్పటికీ ఆపకపోవడంతో కారును వేగంగా పోనిచ్చి డంపర్ ముందు నిలిపే ప్రయత్నం చేశారు.

గమనించిన డంపర్ డ్రైవర్ వేగం పెంచడమే కాకుండా కలెక్టర్ కారును ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. దాన్నుంచి తప్పించుకున్న తర్వాత డంపర్‌ను అనుసరిస్తూ కలెక్టర్ కిలోమీటరు దూరం వెళ్లారు. ఈ క్రమంలో డంపర్ డ్రైవర్ ఒక్కసారిగా వాహనంలోని ఇసుకను రోడ్డుపై అన్‌లోడ్ చేశాడు. దీంతో కలెక్టర్ కారు ఇసుకలో ఆగిపోయింది. 

కలెక్టర్ బాడీ గార్డ్ అంబాదాస్ పావ్నే డంపర్ వద్దకు దూసుకెళ్లి డ్రైవర్ వైపు నుంచి వాహనంలోకి ఎక్కాడు. దీంతో గార్డును బెదిరించిన డ్రైవర్ మూడు కిలోమీటర్ల పాటు పోనిచ్చి అక్కడ వాహనాన్ని ఆపి పరారయ్యాడు. కలెక్టర్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు డంపర్ డ్రైవర్ ప్రకాశ్ కోక్రేను అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Maharashtra
Beed District
Sand Mafia
Deepa Mudhol-Munde

More Telugu News