Rohit Sharma: అతనిలా ఒక్కరు బ్యాటింగ్ చేసినా.. ఫలితం మరోలా ఉండేది: రోహిత్ శర్మ

  • గుజరాత్ గెలుపు క్రెడిట్ అంతా గిల్‌దేనన్న రోహిత్
  • అతడు ఫామ్‌ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నానని వెల్లడి
  • వచ్చే సీజన్ లో మరింత సానుకూలంగా ఆడేందుకు తిరిగి వస్తామన్న ముంబై కెప్టెన్
rohit sharma praises shubman gill looking forward to wtc final match

ఐపీఎల్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ దెబ్బకు ముంబై ఇండియన్స్ ఇంటి బాట పట్టిన విషయం తెలిసిందే. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో గుజరాత్ గెలిచి.. ఫైనల్ లో చెన్నైతో అమీతుమీకి సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో భారీ సెంచరీ (129) చేసిన గుజరాత్ బ్యాట్స్ మన్ శుభ్ మన్ గిల్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గిల్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఈ మ్యాచ్‌లో గిల్ బ్యాటింగ్ అద్భుతం. అతనిలా మా టీమ్‌లో ఒక్కరు బ్యాటింగ్ చేసినా ఫలితం మరోలా ఉండేది. గుజరాత్ గెలుపు క్రెడిట్ అంతా గిల్‌దే. అతడు అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా’’ అని చెప్పాడు.

‘‘ఈ మ్యాచ్‌లో మా స్థాయికి తగినట్టుగా ఆడలేదు. బౌలింగ్ లో అదనంగా పరుగులు ఇచ్చాం. బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. గ్రీన్, సూర్యకుమార్ క్రీజ్ లో ఉన్నంతసేపు మేం గెలుస్తామనే నమ్మకం ఉంది. వారిద్దరూ ఔట్ కావడంతో దారి తప్పినట్లు అనిపించింది. బౌండరీ లైనప్ లు తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి సమయంలోనైనా ఫలితం మారిపోతుంది. గుజరాత్ అన్ని విభాగాల్లోనూ మా కంటే మెరుగ్గా ఆడి విజయం సాధించింది’’ అని రోహిత్ అన్నాడు. వచ్చే సీజన్ లో మరింత సానుకూలంగా ఆడేందుకు తిరిగి వస్తామన్నాడు.

More Telugu News