KCR: మోదీని, కేంద్రాన్ని తిట్టడమే కేసీఆర్​ పని: కిషన్​ రెడ్డి

  • వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా డబ్బులు పంచేందుకే జీవో 111ను రద్దు చేశారని విమర్శ 
  • నీతి ఆయోగ్ కంటే సీఎంకు ముఖ్యమైన పనేంటని ప్రశ్నించిన కేంద్ర మంత్రి
  • తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారంటూ కేసీఆర్ పై ఆగ్రహం
KCR job is to insult Modi and the Centre says Kishan Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్‌‌పై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు ఢిల్లీలో జరిగిన  నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ హాజరుకాకపోవడంపై విమర్శలు చేశారు. దీనికంటే ముఖ్యమైన పనేముందని కేసీఆర్ ను ప్రశ్నించారు. 

ఈ రోజు హైదరాబాద్ లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. అన్ని రాష్ట్రాలను కలుపుకొని మోదీ ముందుకెళ్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. కానీ, కేసీఆర్ నీతి ఆయోగ్ కు వెళ్లకపోవడం దురదృష్టకరమన్నారు. 

రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో భూములు అమ్మితేగానీ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. అయినా తెలంగాణలో పేదరికమే లేనట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర  ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.50 లక్షల కోట్ల అప్పు ఉందని.. బడ్జెటేతర అప్పులు కలుపుకుంటే మొత్తం 6 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిపారు. తెలంగాణకు కేంద్రం సాయంపై చర్చకు సిద్ధమని కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాలు విసిరారు.

దళిత ముఖ్యమంత్రి, దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు హామీలు సహా కొన్ని వందల సార్లు కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. మాట తప్పితే తల నరుక్కుంటాననే కేసీఆర్.. కొన్ని వేల సార్లు తల నరుక్కోవాల్సి వచ్చేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా డబ్బులు పంచడం కోసమే 111 జీవో రద్దు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు 111 జోవో పరిధిలో వందలాది ఎకరాలున్నాయన్నారు.

More Telugu News