Hyderabad: ఐపీఎల్‌లో తెలుగు వీర ‘తిలకం’.. తిలక్‌ వర్మకు ఇక తిరుగులేదిక!

  • ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటిన తిలక్‌ వర్మ
  • 11 మ్యాచ్‌ల్లో 343 పరుగులు చేసిన హైదరాబాదీ
  • ఆఖరి మ్యాచ్లో మెరుపులతో సర్వత్రా ప్రశంసలు
Hyderabadi Tilak varma impresses in IPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరలేకపోయింది. లీగ్ దశలో పడుతూ లేస్తూ ముందుకొచ్చి ప్లేఆఫ్స్ చేరిన ఆ జట్టు ఎలిమినేటర్1లో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసినా.. డిఫెండింగ్ చాంప్ గుజరాత్ టైటాన్స్‌ను దాటలేకపోయింది. శుక్రవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్2 మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. దాంతో, ఈ సీజన్‌లో ముంబై ప్రస్థానం ముగిసింది. 

ఇక ముంబై టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచిపోయినా ఈ సీజన్‌లో ఆ జట్టు నుంచి కొందరు యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. అందులో మొదటి వ్యక్తి మన తెలుగు క్రికెటర్, హైదరాబాదీ తిలక్ వర్మ. ఎడమ చేతి వాటం బ్యాటర్ అయిన తిలక్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముంబై బ్యాటింగ్ కు కీలకంగా నిలిచాడు. ఈ సీజన్‌లో ఆడిన 11 ఇన్నింగ్స్ ల్లో 42.88 సగటుతో 343 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ సెంచరీ కూడా ఉంది. స్ట్రయిక్ రేట్ 164.11 కావడం విశేషం. 

అనారోగ్యం కారణంగా మరో ఐదు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. లేదంటే అతను ముంబై టాప్ స్కోరర్‌‌గా నిలిచే వాడు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 36.09 సగటుతో 397 పరుగులతో మెప్పించిన అతను ఈసారి కూడా అదే జోరు కొనసాగించాడు. తన తొలి మ్యాచ్లోనే ఆర్సీబీపై 84 రన్స్ తో మెరుపు ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. మరికొన్ని మ్యాచ్ లలోనూ విలువైన పరుగులతో ముంబై విజయాల్లో పాలు పంచుకున్నాడు. క్వాలిఫయర్2లో ఆరంభంలోనే రెండు వికెట్లు పడ్డ సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన తిలక్ ధనాధన్ బ్యాటింగ్ తో అలరించాడు. ముఖ్యంగా ఈ సీజన్ టాప్ వికెట్ టేకర్ అయిన షమీ వేసిన ఐదో ఓవర్లో నాలుగు ఫోర్లు, సిక్స్ సహా 24 రన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబై కెప్టెన్ రోహిత్ సహా మరెందరో వరల్డ్ క్లాస్ బ్యాటర్లను వణికించిన షమీ బౌలింగ్‌నే తిలక్‌ ఉతికేయడం అబ్బురపరిచింది. 

తిలక్ బ్యాటింగ్ చేస్తుంటే బౌలర్ ఎవరన్నది పట్టించుకోడని, కేవలం బంతిని మాత్రమే చూసి షాట్లు కొడుతాడని రోహిత్ చెప్పాడు. ఇది నాణ్యమైన బ్యాటర్ కు ఉండాల్సిన లక్షణం. తన నిర్భయమైన ఆటతో వరుసగా రెండు సీజన్లలో సత్తా చాటిన తిలక్ మంచి ఆఫ్ బ్రేక్ బౌలర్ కూడా. తిలక్ ఇదే జోరును కొనసాగిస్తే త్వరలోనే టీమిండియా గడప తొక్కడం ఖాయమని సీనియర్లు, నిపుణులు జోస్యం చెబుతున్నారు.

More Telugu News